కడపకు పవన్ కళ్యాణ్: దాడి ఘటనపై సీరియస్
కడప: అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుపై జరిగిన దాడి ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ దాడి ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందని, ఈ దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో ఉన్న జవహర్ బాబుపై వైసీపీ నేత దాడి చేయడం అప్రజాస్వామిక చర్య మండిపడ్డారు.
ఇటువంటి దౌర్జన్యాలకు, రౌడీ చర్యలకు కూటమి ప్రభుత్వంలో తావు లేదని పవన్ కళ్యాణ్ తేల్చి చెప్పారు. ఎంపీడీవోపై జరిగిన దాడి గురించి అధికారులతో పవన్ కళ్యాణ్ చర్చించారు. దాడికి కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని, బాధిత ఎంపీడీవోకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఎంపీడీవోకు, ఆయన కుటుంబానికి ధైర్యం చెప్పాలని సూచించారు.

జవహర్ బాబుపై దాడి చేసినవారికి రాజ్యాంగం పట్ల, ప్రజాస్వామ్యం పట్లా ఏ మాత్రం గౌరవం లేదని అర్థం అవుతూందన్నారు. దాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారా బలమైన సంకేతం ఇవ్వాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. మండల పరిషత్ కార్యాలయంలో చోటు చేసుకున్న దాడిపై విచారణ చేయడంతోపాటు ఎంపీడీవో ఆరోగ్యం గురించి నివేదిక ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ను డిప్యూటీ సీఎం పవన్ ఆదేశించారు.
మరోవైపు, శనివారం వైసీపీ నేతల దాడిలో గాయపడిన ఎంపీడీవోను పవన్ పరామర్శించనున్నారు. కడప రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును పరామర్శించనున్నారు పవన్ కళ్యాణ్. అధికారితోపాటు ఆయన కుటుంబానికి పవన్ కళ్యాణ్ ధైర్యం చెప్పనున్నారు.
అసలేం జరిగిందంటే.. గాలివీడు ఎంపీడీవో జవహర్ బాబుపై వైఎస్సార్సీపీ నేత సుదర్శన్ రెడ్డి, ఆయన అనుచరులు తీవ్రంగా దాడి చేశారు. గాలివీడు ఎంపీపీ పద్మావతమ్మ కుమారుడు సుదర్శన్ రెడ్డి దాడికి పాల్పడినట్లు ఎంపీడీవో పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు చేశారు. ఛాంబర్లో ఉన్న తన వద్దకు సుదర్శన్ రెడ్డి వచ్చి ఎంపీపీ గది తాళాలు ఇవ్వాలని అడిగారని ఎంపీడీవో జవహర్ బాబు తెలిపారు. ఎంపీపీ లేకుండా తాళాలు ఇవ్వడం కుదరదని చెప్పడంతో దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. సుదర్శన్, అతని అనుచరులు విచక్షణారహితంగా కొట్టారని వాపోయారు.












Click it and Unblock the Notifications