Deputy CM: డిప్యూటీ సీఎం వంగా గీత- అప్పుడే కారుపై స్టిక్కర్.. !
ఏపీలో ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అత్యంత ఉత్కంఠ రేపిన నియోజకవర్గాల్లో పిఠాపురం కూడా ఒకటి. ఇక్కడ నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ తొలిసారి బరిలోకి దిగడమే ఇందుకు కారణం. ఇక్కడ పవన్ ను ఎలాగైనా ఓడించాలన్న పట్టుదలతో వైసీపీ నేతలు పనిచేశారు. ముఖ్యంగా తాజాగా పార్టీలోకి వచ్చిన ముద్రగడ పద్మనాభం పిఠాపురంలో వంగా గీత గెలుపు కోసం తీవ్రంగా శ్రమించారు. ఓ దశలో పవన్ గెలిస్తే పేరు మార్చుకుంటానని సవాల్ విసిరేవరకూ వెళ్లారు. ఆయన ప్రతిన నిజమవుతుందో లేదో కానీ ఆలోపే పిఠాపురంలో విచిత్ర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పై పోటీ చేసిన తమ అభ్యర్ధి వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తానంటూ సీఎం జగన్ హామీ ఇచ్చారు. దీంతో గీత గెలిస్తే డిప్యూటీ సీఎం అవకాశాలు ఉంటాయన్న చర్చ ఎన్నికల పోలింగ్ వేళ సాగింది. అయితే పవన్ కళ్యాణ్ కు మద్దతుగా కాపులు ఏకం కావడంతో అక్కడ ఫలితం జనసేనకు అనుకూలంగా ఉంటుందన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఇవేవీ పట్టించుకోని స్థానిక వైసీపీ నేతలు వంగా గీతను డిప్యూటీ సీఎంగా అప్పుడే ఊహించేసుకుంటున్నారు.

రాష్ట్రమంతా పిఠాపురంలో ఫలితం ఎలా ఉండబోతోందని ఎదురుచూస్తుంటే స్థానిక వైసీపీ నేతలు మాత్రం అప్పుడే తమ కార్లకు డిప్యూటీ సీఎం వంగా గీత అని స్టికర్లు పెట్టుకుని తిరిగేస్తున్నారు. వాస్తవానికి పిఠాపురంలో తన గెలుపుపై ఇప్పటికే వంగా గీతకు ఏమాత్రం ఆశల్లేవని పోలింగ్ తర్వాత ఆమె మాటలను బట్టి అర్దమవుతోంది. కానీ వైసీపీ నేతలు మాత్రం ఆమెను డిప్యూటీ సీఎంగా ఊహించుకుని కార్లపై స్టిక్కర్లు పెట్టుకుని తిరుగుతున్నారు. దీంతో స్థానికులు ఆలు లేదు చూలు లేదు డిప్యూటీ సీఎం వంగా గీత అని చర్చించుకుంటున్నారు. అప్పుడే 'గీత గోవిందం' మొదలైందా? అని ఆశ్చర్యపోతున్నారు.












Click it and Unblock the Notifications