ఏపీలో భారీ పేలుడు: ఛిన్నాభిన్నం- ఆరుమంది సజీవ దహనం
తూర్పు గోదావరి జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఓ బాణసంచా కర్మాగారంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ దుర్ఘటనలో ఆరుమంది దుర్మరణం పాలయమ్యారు. మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు.
జిల్లాలోని బిక్కవోలు మండలం కొమరిపాలెంలో కొద్దిసేపటి కిందటే ఈ దుర్ఘటన సంభవించింది. కొమరిపాలెంలో లక్ష్మీ గణపతి ఫైర్ వర్క్స్ కంపెనీ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. దీపావళి సమీపిస్తోన్న నేపథ్యంలో ఇక్కడ బాణసంచా తయారీ ముమ్మరంగా చేపట్టారు కార్మికులు. బాణాసంచాను తయారు చేస్తోన్న సమయంలో హఠాత్తుగా మంటలు చెలరేగాయి. అక్కడున్న రసాయనాలు, గంధకం, భాస్వరం..ఇవన్నీ కూడా మంటలు త్వరగా వ్యాప్తిచెందడానికి దోహదం చేసేవే.

దీంతో మంటలు ఒక్కసారిగా ఫైర్ వర్క్స్ భవనాన్ని చుట్టుముట్టాయి. అగ్నికీలలు శరవేగంగా వ్యాపించాయి. ఆ సమయంలో అక్కడ పలువురు కార్మికులు బాణాసంచా తయారీలో నిమగ్నమై ఉన్నవారు. వారందరూ సురక్షితంగా బయటపడే సమయం కూడా దొరకలేదంటే.. మంటల తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మంటల ధాటికి అక్కడ నిల్వ ఉంచిన బాణాసంచా పేలిపోయింది. అనేక మంది కార్మికులు లోపల చిక్కుకుపోవడంతో మృతుల సంఖ్య పెరిగింది.
దీన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. మంటలను ఆర్పివేశారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలు చాలా కష్టంగా మారాయని పోలీసులు తెలిపారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారులు, రెవెన్యూ అధికారులు, అత్యవసర సిబ్బంది ప్రస్తుతం సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
క్షతగాత్రులను రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కనీస భద్రతా చర్యలు కొరవడటం, రసాయనాలను సరిగ్గా క నిల్వ ఉంచకపోవడం వల్ల ఈ పేలుడు సంభవించి ఉండవచ్చని ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దుర్ఘటన పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలని ఆదేశించారు.












Click it and Unblock the Notifications