జగన్‌కు దేవినేని కౌంటర్, గుంటూర్లో రియల్ రేట్లకు చెక్
విజయవాడ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు బుధవారం నిప్పులు చెరిగారు. తాము హత్యా రాజకీయాలను ప్రోత్సహించమని వైయస్ జగన్మోహన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు.
కాంగ్రెస్ హయాంలో ఇసుక మాఫియాను ప్రోత్సహించారని విమర్శించారు. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై 23 కేసులు బనాయించారన్నారు. హత్యా రాజకీయాలను తాము ఉక్కుపాదంతో అణిచివేస్తామని దేవినేని చెప్పారు. టీడీపీ పైన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బురద జల్లుతోందన్నారు.
కాగా, చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు దౌర్జాన్యాలకు పాల్పడుతున్నారని జగన్ ఉదయం మండిపడ్డ విషయం తెలిసిందే. కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలోని గొట్టుముక్కలలో ప్రత్యర్థుల దాడిలో హత్యకు గురైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కృష్ణారావు కుటుంబాన్ని జగన్ బుధవారం పరామర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ పైన విమర్శలు గుప్పించారు.

చంద్రబాబు అధికారంలోకి వచ్చాక తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దౌర్జన్యాలు పెరిగిపోయాయని, ఓటు వేయలేదనే కారణంతో ఇంట్లోకి దౌర్జన్యంగా వెళ్లి హత్య చేశారన్నారు. తమ పార్టీ నేతలపై ఇంత దారుణాలు జరుగుతున్నా పోలీసులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారన్నారు. గతంలో తెలుగుదేశం గుండాలు మందుగుండు సామాగ్రి పేలుస్తుంటే.. పిల్లలు భయపడతారని చెప్పినందుకు సురేష్ అనే వ్యక్తి తల మీద బాంబు పెట్టి పేల్చి చంపేశారన్నారు. చంద్రబాబుకు మానవత్వం ఏమైనా ఉందా అన్నారు.
కృష్ణా, గుంటూరులో రియల్ ఎస్టేట్ ధరలకు కళ్లెం
ఏపీ తాత్కాలిక రాజధానిగా విజయవాడను ప్రకటించడంతో కృష్ణా, గుంటూరు జిల్లాలో రియల్ ఎస్టేట్ ధరలు అంచనాలకు అందకుండా పెరిగే అవకాశం ఉండటంతో వాటికి కళ్లెం వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. భూమార్పిడి ప్రక్రియను వెంటనే నిలిపివేయాలంటూ బుధవారం ఉదయం రెవెన్యూ, ఉడా అధికారులకు మౌఖిక ఆదేశాలు ప్రభుత్వం జారీ చేసింది. ఉడా నుంచి భూమార్పిడి ప్రక్రియ ఫైళ్లు హైదరాబాద్‌కు పంపవద్దని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఉడాలో పలు రియల్ ఎస్టేట్ కంపెనీల ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications