మీ బావమరిది అక్రమాలు కనపడటంలేదా ఎమ్మెల్యే గారూ?
కొండపల్లిలో అక్రమ మైనింగ్, మద్యం షాపులు, కృష్ణా నదిలో ఇసుక, పేదలకు అందాల్సిన రేషన్‌ను అక్రమ మార్గాన పక్కదోవ పట్టిస్తోంది "నీ బావమరిది" కాదా? అని తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రశ్నించారు. మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
జి.కొండూరులోని పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ పేరు మార్పును వ్యతిరేకిస్తూ నాయకులు, కార్యకర్తలు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఉమ మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయాలపై ధ్వజమెత్తారు. తీసుకున్న నిర్ణయాలను ప్రశ్నిస్తున్నందుకు తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి అరెస్ట్ చేయిస్తున్నారని, చెరువులు అక్రమంగా తవ్వుకునేది వైసీపీ నాయకులేనని మండిపడ్డారు.

అధికారంలోకి వచ్చి 40 నెలలవుతున్నా పోలవరానికి పునాదులు వేయలేదని, అసమర్ధతను కప్పిపుచ్చుకోవడానికి తనపై ఆరోపణలు చేస్తున్నారని, దమ్ముంటే వాటిని నిరూపించాలంటూ సవాల్ విసిరారు.
పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులతోపాటు చెరువులను కూడా తాను దోచేశానంటూ మాయమాటలు చెబుతున్నారని, ప్రశ్నించినందుకు తనపై గూండాలతో దాడి చేయించారన్నారు. 40 సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలపై 40 నెలల నుంచి అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం ఎన్ని అక్రమ కేసులు పెట్టినా బెదిరే ప్రసక్తే లేదన్నారు. వైసీపీని ఓడించడానికి గ్రామ గ్రామాన పార్టీ నాయకులు కసిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. నిరసన దీక్షలో పార్టీ రాష్ట్రస్థాయి నాయకులు పలువురు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications