తిరుమలలో అరుదైన దివ్యక్షేత్రం- రోజూ దర్శించలేం
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. శుక్రవారం నాడు 63,987 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 26,880 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 2.88 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో అన్ని కంపార్ట్‌మెంట్లూ భక్తులతో నిండిపోయాయి. ట్రావెలర్స్ బంగళా వరకూ క్యూలైన్ ఏర్పడింది. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లు, క్యూ లైన్లల్లో ఉన్న వారికి టీటీడీ సిబ్బంది అన్నప్రసాదం, మజ్జిగ, మంచినీరు, అల్పాహారాన్ని పంపిణీ చేశారు.
కాగా- తిరుమలలో కుమారధార- పసుపుధార తీర్థ ముక్కోటి ఉత్సవాలు శాస్త్రోక్తంగా ముగిశాయి. శుక్రవారం తెల్లవారు జామున 5 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మాత్రమే కుమారధార తీర్థాన్ని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. కుమారధారంలో పుణ్యస్నానాలను ఆచరించారు. తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి వాయవ్య దిశలో ఉందీ కుమారధార తీర్థం. ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా శేషాచలం ప్రకృతి సౌందర్యం మధ్య భక్తులు కుమారధార తీర్థ ముక్కోటిని దర్శించారు. కుమారధార సందర్భంగా ఈ మార్గంలో టీటీడీ ఆరోగ్య విభాగం, అటవీశాఖ, విజిలెన్స్, శ్రీవారి సేవకులు, పోలీసులు భక్తుల భద్రతను పర్యవేక్షించారు.
భక్తులకు శ్రీవారి సేవకులు అల్పాహారాన్ని అందించారు. పాలు, కాఫీ, ఉప్మా, పొంగలి, సాంబారు అన్నం, పెరుగన్నం, పులిహోర, మజ్జిగ, మంచినీటి వసతిని టీటీడీ అధికారులు కల్పించారు. టీటీడీ విజిలెన్స్, పోలీస్, అటవీ విభాగాలు సమన్వయంతో పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఆరోగ్య విభాగం ఆధ్వర్యంలో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసి వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించారు.
అధిక బరువు, ఆస్తమా, గుండె సంబంధిత సమస్యలు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, చిన్నపిల్లలు, వృద్ధుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని అటవీ మార్గంలో ఈ తీర్థానికి నడిచి వెళ్లడానికి అనుమతించ లేదు. గోగర్భం నుండి పాపవినాశనం వరకు ఆర్టీసీ బస్సుల్లో మాత్రమే భక్తులు వెళ్లగలిగారు.
అదే రోజున తిరుమలలో హోలీ పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరిగింది. శుక్రవారం సాయంత్రం 7 నుండి రాత్రి 9 గంటల వరకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడవాహనారూఢుడై నాలుగు తిరుమాడ వీధుల్లో విహరించారు. భక్తులను కటాక్షించారు. టీటీడీ అర్చకులు శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.












Click it and Unblock the Notifications