కార్తీకమాసంలో తిరుపతి కపిలతీర్థంలో రూ. 500 లతో.. !!
పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో నెల రోజుల పాటు విశేష హోమాలు, ప్రత్యేక పూజలు జరుగనున్నాయి. ఈ హోమ మహోత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.డిసెంబర్ 8వ తేదీ వరకు ఈ ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగనున్నాయి. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి.
అంకురార్పణలో భాగంగా మంగళవారం సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు గణపతి పూజ, పుణ్యాహవచనం, వాస్తుపూజ, పర్యన్నీకరణం, మృత్సంగ్రహణం, అంకురార్పణ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం కలశస్థాపన, అగ్నిప్రతిష్ఠ, లఘుపూర్ణాహుతి చేపట్టారు. నేడు శ్రీగణపతి హోమంతో ఈ ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు అర్చకులు. రేపు, ఎల్లుండి శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి హోమాన్ని నిర్వహిస్తారు.

14న ధర్మశాస్త్ర హోమం, 15న శ్రీ నవగ్రహ హోమం జరుగనున్నాయి. 16న శ్రీ దక్షిణామూర్తి, 17న శ్రీ కాలభైరవస్వామి హోమాలను చేపడతారు. ఆ తర్వాత 18 నుంచి 26వ తేదీ వరకు శ్రీ కామాక్షి అమ్మవారి చండీహోమం నిర్వహిస్తారు. 27 నుంచి డిసెంబర్ 7వ తేదీ వరకు శ్రీ కపిలేశ్వరస్వామివారి రుద్రహోమం, 8న శ్రీ చండికేశ్వరస్వామివారి హోమం ఉంటాయి. ఈ రెండు కీలకమైనవిగా భావిస్తారు అశేష భక్తులు. చివరి రోజున త్రిశూలస్నానం, పంచమూర్తుల తిరువీధి ఉత్సవంతో ఇవి ముగుస్తాయి.
భక్తులు ఇద్దరు గృహస్తులు కలిపి రూ. 500 చెల్లించి ఒక రోజు హోమంలో పాల్గొనవచ్చు. వారికి ఒక ఉత్తరీయం, రవికెతో పాటు అన్నప్రసాదం అందజేస్తారు. హోమాల్లో పాల్గొనే వారు తప్పనిసరిగా సంప్రదాయ వస్త్రధారణతో రావాల్సి ఉంటుంది. ఈ హోమ మహోత్సవాల్లో భాగంగా 15న శ్రీ వళ్లీ దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యస్వామివారి కల్యాణోత్సవం జరుగుతుంది. 7న మాస శివరాత్రి సందర్భంగా శ్రీ శివపార్వతుల కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. ఒక్కో కల్యాణోత్సవంలో ఇద్దరు గృహస్తులు పాల్గొనవచ్చు.
శ్రీకపిలేశ్వరాలయంలో టీటీడీ 2012వ సంవత్సరం నుంచి ఈ హోమ మహోత్సవాలను నిర్వహిస్తూ వస్తోంది. ఏటా భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. హోమంలో పాల్గొనే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. వ్యక్తిగతంగా ఈ హోమాలను నిర్వహించుకోవడం ఖర్చుతో కూడుకున్నది కావడంతో, సామాన్య భక్తులకు సైతం హోమ ఫలాన్ని పొందే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో టీటీడీ సామూహికంగా వీటిని నిర్వహిస్తోంది.













Click it and Unblock the Notifications
