తిరుమల శ్రీవారి సేవల్లో రెండు కీలక మార్పులు- రేపటి నుంచే
Tirumala: తిరుమలలో భక్తుల రద్దీ నెలకొంది. వారాంతపు రోజు కావడం వల్ల భక్తులు శ్రీవారి దర్శనానికి పోటెత్తారు. శనివారం నాడు 72,962 మంది స్వామివారిని దర్శించుకున్నారు. వారిలో 30,645 మంది తలనీలాలు సమర్పించారు. తమ మొక్కులు చెల్లించుకున్నారు. ఆ ఒక్క రోజే హుండీ ద్వారా 3.37 కోట్ల రూపాయల ఆదాయం తిరుమల తిరుపతి దేవస్థానానికి అందింది.
వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 22 కంపార్టుమెంట్లల్లో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వ దర్శనానికి 18 నుంచి 20 గంటల సమయం పట్టింది. కంపార్ట్‌మెంట్లల్లో ఉన్న వారికి శ్రీవారి సేవకులు మంచినీరు, పాలు, అల్పాహారాన్ని అందించారు.

తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామివారి సేవల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. సోమవారం నుంచి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవకు బదులుగా తిరుప్పావై పాశురాలను నివేదిస్తారు. ధనుర్మాసారంభం కావడమే దీనికి కారణం. జనవరి 14వ తేదీ వరకు సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై కొనసాగుతుంది.
నేటి నుంచి ధనుర్మాసం ఆరంభమైంది. ఈ తెల్లవారు జామున 6:57 నిమిషాలకు ధనుర్మాస ఘడియలు మొదలయ్యాయి. దీనితో సోమవారం నుంచి తిరుప్పావై పాశురాల వినిపిస్తారు. జనవరి 14వ తేదీన ధనుర్మాస ఘడియలు ముగియనున్నాయి. ఆ తరువాత యధాతథంగా సుప్రభాత సేవను పునరుద్ధరిస్తారు.
శ్రీవారి ఆలయంలో నెల రోజులపాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు. ఈ సందర్భంలో సాధారణంగా భోగ శ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీ కృష్ణస్వామివారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది.
ధనుర్మాసంలో శ్రీవారికి విశేష కైంకర్యాలు నిర్వహిస్తారు అర్చకులు. బిల్వ పత్రాలతో సహస్ర నామార్చన చేస్తారు. శ్రీవిల్లి పుత్తూరు చిలుకలను ప్రతిరోజూ స్వామివారికి అలంకరిస్తారు. ధనుర్మాసం సందర్భంగా శ్రీవారికి విశేష నైవేద్యాలుగా దోసె, బెల్లం దోసె, సుండలు, సీరా, పొంగల్ వంటి ప్రసాదాలతో పూజిస్తారు.
12 మంది ఆళ్వార్లలో శ్రీఆండాళ్ (గోదాదేవి) ఒకరు. నాచియార్ అని కూడా పిలుస్తారు. శ్రీ వేంకటేశ్వరస్వామివారిని స్తుతిస్తూ ఆండాళ్ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు. ఆళ్వార్ దివ్య ప్రబంధాల్లో తిరుప్పావై ఒక భాగం. తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది.












Click it and Unblock the Notifications