చంద్రబాబు అమరావతి కాడె వదిలేసినట్టేనా? టీడీపీ వైఖరి పట్ల అనుమానాలు: తాత్కాలికమా?
అమరావతి: అమరావతి పరిరక్షణ ఉద్యమం విషయంలో తెలుగుదేశం పార్టీ మరోసారి యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. మొదటి నుంచీ ఈ ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తోన్న టీడీపీ.. క్రమంగా అందులో నుంచి బయటపడటానికి మార్గాలను అన్వేషిస్తోందనే అభిప్రాయాలు ఉన్నాయి. పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని.. అమరావతి అజెండాను తాత్కాలికంగా పక్కన పెట్టేసిందని అంటున్నారు. అమరావతి పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనాల్సి వస్తే. పార్టీకి ఎదురుదెబ్బలు తప్పకపోవచ్చనే భావన టీడీపీ నేతల్లో వ్యక్తమౌతోందని, ఈ పరిణామాల మధ్య ఆ పార్టీ నేతలు తాత్కాలికంగా అమరావతి ఊసెత్తకపోవచ్చనే అభిప్రాయాలు ఉన్నాయి.

స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే వరూ..
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. ఫిబ్రవరి 9వ తేదీన తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ జరుగనుంది. దీనికి సంబంధించిన నామినేషన్ల పర్వం ఇంకొన్ని గంటల్లో ముగియబోతోంది. ఈ ఎన్నికలను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. కంటే టీడీపీనే అత్యధికంగా ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందనేది బహిరంగ రహస్యం. 2018లో తన ప్రభుత్వ హయాంలో నిర్వహించలేని స్థానిక సంస్థల ఎన్నికలను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఎదుర్కొంటున్నారు.

ఎప్పటికైనా జరిగే ఎన్నికలే కావడంతో..
స్థానిక సంస్థలకు ఎన్నికలను నిర్వహించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైసీపీ ప్రభుత్వం ముందు నుంచీ ఆసక్తిగానే ఉంటూ వస్తోంది. ఎప్పటికైనా జరిగే ఎన్నికలే కావడంతో- ఆ ప్రక్రియ ఏదో తాను నియమించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హయాంలోనే పూర్తి అయ్యేలా చంద్రబాబు జాగ్రత్త పడ్డారని అంటున్నారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవీ విరమణ చేసిన తరువాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లడం కంటే ఆయన హయాంలోనే పూర్తి కావాలనే పట్టుదల టీడీపీ నేతల్లో నెలకొని ఉందని అంటున్నారు.

దీనికోసం అమరావతిని సైతం..
అమరావతి ఉద్యమానికి చంద్రబాబు, టీడీపీ నాయకులు చుక్కానిగా మారారనడంలో సందేహాలు అక్కర్లేదు. చంద్రబాబు సారథ్యాన్ని వహిస్తుండటం వల్లే ఈ ఉద్యమం 400 రోజులకు పైగా సజీవంగా ఉంటూ వచ్చిందని ఇప్పటికే పలువురు బహిరంగంగా వ్యాఖ్యానించిన సందర్భాలు ఉన్నాయి. అమరావతి ప్రాంత రైతుల కోసం చంద్రబాబు జోలె పట్టడాన్ని దీనికి ఉదాహరణగా చూపిస్తున్నారు. అలాంటి చంద్రబాబు, ఆయన పార్టీ- తాత్కాలికంగా అమరావతి ఉద్యమం నుంచి దాదాపుగా తప్పుకొందని, స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కొద్ది రోజుల పాటు దాని జోలికి వెళ్లకపోవచ్చని చెబుతున్నారు.

మేనిఫెస్టోలో అమరావతికి దక్కని చోటు..
సంప్రదాయదానికి భిన్నంగా పంచాయతీ ఎన్నికలకు కూడా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇదివరకెప్పుడూ పంచాయతీ ఎన్నికలకు మేనిఫెస్టోను విడుదల చేసిన సందర్భాలు లేవని, ప్రజలను మరోసారి మభ్య పెట్టడానికే చంద్రబాబు తన చేతుల మీదుగా మేనిఫెస్టోను విడుదల చేశారనే ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. చంద్రబాబు మానస పుత్రికగా భావించే రాజధాని అమరావతికి చోటు దక్కకపోవడం అనేక సందేహాలకు తావిస్తోంది. అమరావతి కొనసాగింపుపై గానీ, ఆ ప్రాంత ఉద్యమానికి న్యాయం చేసేలా లేదా.. ప్రభుత్వం కొమ్ములు వంచి.. రాజధానిని తరలనివ్వకుండా ఒత్తిళ్లను తీసుకొస్తామని మేనిఫెస్టోలో పొందుపరచలేదు.

పంచాయతీ ఎన్నికలకు అమరావతి ఉద్యమానికి లంకె లేదనుకున్నా..
గ్రామ స్థాయిలో పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికలకు.. అమరావతి ఉద్యమానికి ఏ మాత్రం లంకె లేదనే వాదనలు కూడా లేకపోలేదు. అలాగనీ- అమరావతి ప్రాంత పరిధిలో స్థానిక సంస్థలను నిర్వహించట్లేదని అనుకోవడం పొరపాటే. అమరావతి గ్రామాల్లోనూ ఎన్నికలను నిర్వహిస్తారు. అమరావతి ప్రాంత ప్రజలకు కావాల్సింది..రాజధాని తరలి వెళ్లకుండా అడ్డుకోగలుగుతామనే భరోసా ఒక్కటే. చంద్రబాబు మేనిఫెస్టో ద్వారా ఈ భరోసాను ఆ ప్రాంత ప్రజలకు ఎందుకు ఇవ్వలేకపోయారని వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

మిగిలిన ప్రాంతాల్లో డిపాజిట్లు కూడా దక్కవంటూ..
దీనికి కారణం- అమరావతి పేరుతో స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తే.. మిగిలిన ప్రాంతాల్లో ఘోరంగా ఓడిపోతామనే భయమేనని అంటుననారు. వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని స్థానిక సంస్థలు ముగిసేంత వరకూ టీడీపీ అమరావతి ఉద్యమం జోలికి వెళ్లకపోవచ్చని విమర్శిస్తున్నారు. అమరావతిని సైతం చంద్రబాబు తన రాజకీయ అవసరాల కోసమే వినియోగించుకుంటున్నారనడానికి ఇంతకంటే నిదర్శనం ఇంకేమి కావాలని ప్రశ్నిస్తున్నారు వైసీపీ నేతలు.