పవన్ కళ్యాణ్, చంద్రబాబు మధ్య మల్కాజి'కిరి'
హైదరాబాద్: జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్‌కు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి వివాదం తలెత్తినట్లు తెలుస్తోంది. ఇంతకు ముందు విజయవాడ లోకసభ సీటు విషయంలో వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. తాజాగా, మల్కాజిగిరి లోకసభ స్థానం విషయంలో వివాదం తలెత్తినట్లు ప్రచారం సాగుతోంది.
మల్కాజిగిరి స్థానం విషయంలో ఇరువురి మధ్య ఒకటి రెండుసార్లు చర్చలు జరిగాయని, ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మల్లారెడ్డి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడే లోక్‌సత్తా తరపున జయప్రకాశ్ నారాయణ పోటీ చేస్తున్నారు.

జెపి తరపున ప్రచారం చేస్తానని పవన్ కళ్యాణ్ ప్రకటన చేశారు. దీనిపై తెలుగుదేశం నాయకులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మల్కాజ్‌గిరిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి స్పష్టమైన విజయావకాశాలున్నాయని, జెపి తరపున పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తే కాంగ్రెస్ వ్యతిరేక ఓట్లు చీలిపోయి కాంగ్రెస్ అభ్యర్థి లాభపడతారని తెలుగుదేశం పార్టీ నేతలు వాదిస్తున్నారు.
అయితే, తాను ప్రచారం చేస్తానని తాను ఇప్పటికే జెపికి హామీ ఇచ్చానని, ఇప్పుడు వెనక్కి తగ్గడం భావ్యంగా ఉండదని పవన్ కళ్యాణ్ టిడిపి నేతలకు వివరించారు. మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం పరిధిలో సీమాంధ్ర ఓటర్ల ఓట్లు అత్యధిక శాతం తమకే దక్కుతాయని తెలుగుదేశం భావిస్తోంది. ఈ స్థితిలో పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగి ప్రచారం సాగిస్తే ఓట్లు చీలుతాయనే అభిప్రాయంతో తెలుగుదేశం భావిస్తోంది.












Click it and Unblock the Notifications