చంద్రబాబు సమక్షంలోనే బయటపడ్డ విభేదాలు
సార్వత్రిక ఎన్నికల ముందు టీడీపీలో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. బీజేపీ, జనసేన పార్టీలతో పొత్తు టీడీపీకి కొత్త సమస్య తెచ్చిపెట్టింది. బీజేపీ, జనసేనలతో పొత్తు వల్ల చాలామంది టీడీపీ నేతలకు టికెట్లు దొరకని పరిస్థితి.దీంతో టికెట్ దక్కని నేతలు బహిరంగంగానే తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే కొందరు నేతలు టీడీపీకి రాజీనామా చేయగా, మరికొందరు స్వతంత్ర అభ్యర్థులుగా రంగంలోకి దిగుతున్నట్టు ప్రకటించారు.
మరికొన్ని చోట్ల టీడీపీ నేతల మధ్య వర్గపోరు తారస్థాయికి చేరుకుంది. తాజాగా పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలోనే పార్టీ నాయకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. చంద్రబాబు ప్రజాగళం పేరిట ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా మంగళవారం శ్రీకాకుళం జిల్లాలో పర్యటించారాయన. అయితే చంద్రబాబు బస చేసిన పలాస టీడీపీ కార్యాలయం వద్ద ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. సొంత పార్టీ ప్రత్యర్థులు ఎదురెదురయ్యారు.

పార్టీ కీలక నేత అచ్చెన్నాయుడు, గుండ లక్ష్మీదేవికి మధ్య ఏళ్ల తరబడి వైరం కొనసాగుతోంది. ఒకే పార్టీలో ఉన్నప్పటికీ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. తాజాగా వీరిద్దరు చంద్రబాబు బస చేసిన చోట దర్శనిమిచ్చారు. పలస టీడీపీ కార్యలయం వద్ద అచ్చెన్నాయుడు, గుండ లక్ష్మి దేవి ఒకేసారి కనిపించారు. అయితే ఆ సమయంలో వీరిద్దరు ఎడ ముఖం,పెడ ముఖంగానే కనిపించారు. అచ్చెన్నాయుడును ఒక్కసారిగా అక్కడ చూసి మాజీ మంత్రి గుండ అప్పల సూర్యనారాయణ వెంటనే అక్కడి నుంచి బయటికి వచ్చేశారు. మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి అచ్చెన్నాయుడు ఎదురుగానే ఉన్న ఆయన్ను ఏమాత్రం పలకరించలేదు.
ఈ ఇరువురు నేతలు వ్యవహరించిన తీరు అక్కడున్న పార్టీ నాయకుల్లో పెద్ద చర్చకు దారి తీసింది. ఇదిలా ఉంటే అచ్చెన్నాయుడు జిల్లాలో తమని అణచి వేస్తున్నారంటూ గుండ లక్ష్మీదేవి వర్గం ఆరోపిస్తోంది. గతంలో మీడియా ముందు బహిరంగంగానే అచ్చెన్నాయుడుపై ఆమె తీవ్ర ఆరోపణలు చేశారు. తమకు టికెట్ రాకుండా అచ్చెన్నాయుడు అడ్డుకున్నారని గుండ వర్గం ఆరోపిస్తోంది. తాజాగా చంద్రబాబు సమక్షంలోనే ఈ ఇద్దరి నేతల మధ్య విభేదాలు బయటపడటం టీడీపీలో హాట్ టాపిక్‌గా మారింది.












Click it and Unblock the Notifications