మీ భార్యపై 17 కేసులున్నాయ్.. ఆరెస్ట్ వారెంట్ ఇస్తామంటూ కాల్.. భారీ దోపిడీ!
గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కుంచనపల్లిలో నివసిస్తున్న వృద్ధ దంపతులు ఇటీవల దారుణమైన మోసానికి గురయ్యారు. రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతంగా జీవితం గడుపుతున్న వారి జీవితంలో ఒకే ఒక్క ఫోన్ కాల్ తుఫాన్ సృష్టించింది . నకిలీ పోలీసులు వారిని 'డిజిటల్ అరెస్ట్' చేసి భయపెట్టి, ఏకంగా రూ.2 కోట్లకు పైగా నగదును కాజేశారు. అక్టోబర్ 20న వృద్ధుడు బాలకృష్ణకు ఫోన్ వచ్చింది.
అవతలి నుంచి నేను బెంగళూరు ఇందిరానగర్ ఎస్‌ఐ సందీప్ రావుని. మీ భార్య నళినీదేవిపై 17 కేసులు నమోదయ్యాయి అని చెప్పారు. ఆమె అమ్మాయిలకు సంబంధించిన అసభ్యకర ఫోటోలు తీసి ఇతరులకు పంపుతోందని, వెంటనే ఇద్దరూ బెంగళూరుకు విచారణకు రావాలని హెచ్చరించారు. లేకుంటే అరెస్ట్ తప్పదని బెదిరించారు.భయపడిన బాలకృష్ణ తమకు ఏమీ తెలియదని, రాలేమని చెప్పగానే ఫోన్‌ను సీఐ రాహుల్ చౌదరికి కనెక్ట్ చేస్తున్నామని లైన్ మార్చారు.

రూ.3 కోట్ల మోసంలో మీ భార్య ఖాతా కూడా ఉంది. సుప్రీంకోర్టు నుంచి అరెస్ట్ వారెంట్ జారీ అయింది. కేసును సీబీఐకి అప్పగిస్తున్నాం అని మరింత భయపెట్టారు. నకిలీ సుప్రీంకోర్టు వారెంట్లు, పోలీసు సమన్లు వాట్సాప్‌లో పంపి నమ్మబలికారు.ఆ తర్వాత వీడియో కాల్ ద్వారా వృద్ధులను వారి ఇంట్లోనే డిజిటల్ అరెస్ట్ చేశారు. విచారణ పూర్తయ్యే వరకు మీ ఖాతాలన్నీ ఫ్రీజ్ చేస్తున్నాం. మ్యూచువల్ ఫండ్స్ క్లోజ్ చేసి మేం చెప్పిన ఆర్బీఐ రిజర్వ్ ఖాతాలోకి డబ్బులు బదలాయించండి. నిర్దోషులని తేలితే తిరిగి వస్తాయి అని ఒప్పించారు.
పరువు పోతుందనే భయంతో అక్టోబర్ 31న వారు మ్యూచువల్ ఫండ్స్ నుంచి రూ.2 కోట్లకు పైగా డబ్బులు విజయవాడలోని ఒక బ్యాంక్ బ్రాంచ్ ద్వారా నేరగాళ్లు చెప్పిన ఖాతాకు ట్రాన్స్‌ఫర్ చేశారు.డబ్బులు చేరగానే ఆ నకిలీ పోలీసుల ఫోన్లు సైలెంట్ అయ్యాయి. రోజులు గడిచినా స్పందన రాకపోవడంతో మోసపోయామని గుర్తించి తాడేపల్లి పోలీసులను ఆశ్రయించారు. ప్రస్తుతం పోలీసులు ఆ నగదు జాడ కోసం విచారణ చేపట్టారు.
ఇటువంటి డిజిటల్ అరెస్ట్ మోసాలు దేశవ్యాప్తంగా పెరుగుతున్నాయి. నేరగాళ్లు సాధారణంగా పోలీసు, సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులుగా నటించి, నకిలీ వారెంట్లు, సమన్లు పంపి భయపెడతారు. వృద్ధులు, మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇటువంటి కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.













Click it and Unblock the Notifications
