పవన్ దూకుడు ముందు చంద్రబాబు తేలిపోతున్నారా ? ఇవిగో సాక్ష్యాలు..!
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అనుభవజ్ఞుడైన చంద్రబాబు, దూకుడైన పవన్ కళ్యాణ్ కలిసి ముందుకు సాగుతున్నారు. సీఎం, డిప్యూటీ సీఎంలుగా వీరిద్దరు తమదైన శైలిలో ప్రభుత్వ పాలనపై తనదైన ముద్ర వేస్తున్నారు. చక్కటి సమన్వయంతో వీరిద్దరూ ముందుకు సాగుతున్నారు. అయితే కొన్ని విషయాల్లో మాత్రం పవన్ కళ్యాణ్ చంద్రబాబు కంటే దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అలాగే క్షేత్రస్థాయి పర్యటనల విషయంలోనూ చంద్రబాబు కంటే పవన్ ముందున్నారు.
రాష్ట్రంలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ ఎలా పనిచేస్తారనే దానిపై అందరిలోనూ అనుమానాలు ఉన్నాయి. తొలుత సచివాలయంలోని తన ఛాంబర్ లో కూర్చుని పుస్తకాలు చదువుకోవడం, అధికారులతో సమీక్షలు నిర్వహించడం, తన శాఖపై పట్టు పెంచుకునే ప్రయత్నాలు చేసిన పవన్.. ఆ తర్వాత మంగళగిరిలోని క్యాంపు ఆఫీసుకు మకాం మార్చాక మాత్రం ఫుల్ యాక్టివ్ అయిపోయారు.

ముఖ్యంగా ప్రభుత్వ పాలనపై తన ముద్ర ఉండేలా పవన్ కళ్యాణ్ చూసుకుంటున్నారు. అధికారిక నిర్ణయాలు, క్షేత్రస్థాయి పర్యటనలు ఏవైనా ప్రభావం ఉండే వాటినే ఎంచుకుంటున్నారు. వైసీపీ హయాం అక్రమాల విషయంలోనూ చంద్రబాబు కంటే పవన్ ఎక్కువగా కొరడా ఝళిపిస్తున్నారు. గతంలో జగన్ కుటుంబానికి చెందిన సరస్వతీ పవర్ భూముల విషయంలో అయినా, ఇప్పుడు వైసీపీ నేత సజ్జల ఫ్యామిలీ భూముల కబ్జా వ్యవహారంలో అయినా పవన్ నిర్ణయాలు దూకుడుగా ఉన్నాయన్న చర్చ జరుగుతోంది. దీంతో సహజంగానే సీఎం చంద్రబాబు తేలిపోతున్నారు.
అదే సమయంలో సీఎం చంద్రబాబు అమరావతి, పోలవరం, అభివృద్ధి అంశాలపైనే ఫోకస్ పెడుతున్నారు. నెలవారీ పెన్షన్ల పంపిణీకి వెళ్లడం మినహాయిస్తే చంద్రబాబు క్షేత్రస్ధాయిలో ఎక్కువగా తిరగలేకపోతున్నారు. అలాగే నిర్ణయాల విషయంలోనూ చంద్రబాబు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా విపక్ష వైసీపీని టార్గెట్ చేసేందుకు అవకాశాలు దొరుకుతున్నా చంద్రబాబు మాత్రం కక్షసాధింపు వద్దంటూ దూరంగా ఉండిపోతున్నారు. తాజాగా అదానీ ఒప్పందం విషయంలో చంద్రబాబు వైఖరే ఇందుకు నిదర్శనం. దీంతో సహజంగానే పవన్ కళ్యాణ్ దూకుడుతో తానే సీఎం అన్నట్లు కనిపిస్తున్నారు.












Click it and Unblock the Notifications