రూటు మార్చిన చంద్రబాబు? జీవీ రెడ్డికి పోసానితో కౌంటర్?
ఏపీలో రాజకీయాలు పతాకస్థాయికి చేరుకున్నాయి. అనూహ్యంగా తెరపైకి వచ్చిన ఓ వ్యవహారాన్ని సద్దుమణిగేలా చేసేందుకు ఓ విశ్వప్రయత్నం చేసిన సీఎం చంద్రబాబు, ఆ తర్వాత అది కాస్తా వికటించడంతో మరో ప్రయత్నం చేసినట్లు తాజా పరిణామాలు రుజువు చేస్తున్నాయి. తద్వారా మారిన పరిస్ధితుల్లో రాజకీయంగా ఇబ్బందుల్లేకుండా చూసుకున్నారా అన్న చర్చ రాష్ట్రంలో సాగుతోంది. ఇంతకీ ఆ వ్యవహారం ఏంటో చూద్దాం..
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నామినేటెడ్ పదవుల్లో ఒకటైన ఏపీ ఫైబర్ నెట్ కార్పోరేషన్ ఛైర్మన్ గా పార్టీ కోసం గత ఐదేళ్లుగా తీవ్రంగా శ్రమించిన జీవీ రెడ్డికి చంద్రబాబు అవకాశం ఇచ్చారు. అయితే ఫైబర్ నెట్లో పాత ఫైళ్లను తవ్వితీసేందుకు ఆయన చేసిన ప్రయత్నానికి అధికారుల నుంచి తగిన సహకారం లభించకపోవడంతో ఆయన ప్రెస్ మీట్ పెట్టి ఫైర్ అయ్యారు. ఇది టీడీపీ అధిష్టానంతో పాటు కూటమి ప్రభుత్వాన్నీ ఇరకాటంలోకి నెట్టేసింది.

దీంతో చంద్రబాబు జీవీ రెడ్డిని పిలిపించి మందలించడంతో పాటు రాజీనామా చేయాలని కూడా కోరినట్లు తెలుస్తోంది. దీంతో జీవీ రెడ్డి తీవ్ర అసహనంతో ఫైబర్ నెట్ కార్పోరేషన్ ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. అంతే కాదు టీడీపీకి కూడా గుడ్ బై చెప్పేశారు. దీంతో గత ప్రభుత్వంలో పార్టీ కోసం ఎంతో శ్రమించిన జీవీరెడ్డిని ఎలా వదులుకుంటారంటూ టీడీపీలోనే క్యాడర్ నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో జీవీరెడ్డికి ఎమ్మెల్సీ లేదా మరో పదవి ఇచ్చేలా చర్చలు ప్రారంభించారు. అయితే ఇప్పటికిప్పుడు ఏ పదవి తీసుకున్నా తన క్యారెక్టర్ పై ఆ ప్రభావం పడుతుందని జీవీ రెడ్డి ఆలోచిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు జీవీ రెడ్డి వ్యవహారంలో ఇలా రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరగడం, టీడీపీ క్యాడర్ అసంతృప్తిగా ఉండటంతో దీన్ని డైవర్ట్ చేసేందుకు మరో వ్యవహారం అవసరమైనట్లు తెలుస్తోంది. దీంతో ఎప్పుడో వదిలేసిన వైసీపీ నేత పోసాని కృష్ణమురళిని ఉన్నట్లుండి రాయచోటి పోలీసులు హైదరాబాద్ లోని ఆయన ఇంటికి వెళ్లి అరెస్టు చేసి ఏపీకి తెస్తున్నారు.
పోసాని గత వైసీపీ ప్రభుత్వంలో కూటమి పార్టీల నేతలపై రెచ్చిపోయిన మాట నిజం. అలాగే కూటమి ప్రభుత్వం వచ్చాక వరుస ఫిర్యాదులతో కేసులు నమోదుకావడంతో రాజకీయాలకు గుడ్ బై చెప్పేసిన మాట నిజం. దీంతో కూటమి ప్రభుత్వం కూడా ఆయన్ను పట్టీంచుకోవడం మానేసింది. కానీ ఇప్పుడు జీవీ రెడ్డి ఎపిసోడ్ తో అసంతృప్తిగా ఉన్న క్యాడర్ ను సంతృప్తి పర్చేందుకు పోసానిని అరెస్టు చేయించారా అన్న చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications