ఉత్తరాంధ్రలో చంద్రబాబుకు 'బిగ్ బ్రేకింగ్'?
పట్టభద్రులు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది
పట్టభద్రులు, స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో తెలుగుదేశం పార్టీకి ఊహించని షాక్ తగిలింది. టీడీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి తాను సేవలందిస్తున్నానని, కానీ మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తనకు ఏ పదవీ రానివ్వకుండా అడ్డుపడుతున్నారని పార్టీ సీనియర్ నేత ఈర్లె శ్రీరామమూర్తి ఆరోపించారు. అందుకే ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజకవర్గానికి తెలుగుదేశం పార్టీ రెబెల్ క్యాండిడేట్ గా బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు.
గతంలో తనకు ఆర్టీఐ కమిషనర్ గా, గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా పదవులిచ్చే సమయంలో అయ్యన్న పాత్రుడు అడ్డుతగిలారని, తనకు వచ్చిన అన్ని అవకాశాలను అడ్డుకున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ విషయంలో చంద్రబాబునాయుడు తనను పిలిపించారని, అభ్యర్థిత్వాన్ని పరిశీలించామని, ఒకసారి అచ్చెన్నాయుణ్ని కలవమని చెప్పినట్లుగా వెల్లడించారు.

చివరలో బీసీ సామాజికవర్గానికి చెందిన మహిళకు సీటు కేటాయించారని, ఆ సమయంలో కూడా తాను పార్టీ కోసమే పనిచేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. కానీ తాజాగా ఆమెను తప్పించి తన నియోజకవర్గానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడికి అభ్యర్థిత్వం ఇవ్వడాన్ని ఆక్షేపించారు. అందుకే తాను స్వతంత్ర అభ్యర్థిగా నిలబడాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించారు.
ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి చివరి నిముషంలో లక్ష్మిని తప్పించి కాపు సామాజికవర్గానికి చెందిన చిరంజీవిరావుకు కేటాయించారు. దీనికి నిరసనగా శ్రీరామ్మూర్తి స్వతంత్ర అభ్యర్థిగా నిలబడేందుకు నిర్ణయం తీసుకున్నారు. చిన్నికుమారి లక్ష్మి తన ప్రచారాన్ని ఉధృతం చేస్తున్న తరుణంలో అకస్మాత్తుగా చంద్రబాబు పార్టీ అభ్యర్థిని మారుస్తూ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. తన గెలుపునకు సహకరించాలంటూ చిరంజీవిరావు పార్టీ సీనియర్ నేతలను కలుస్తున్నారు. ఈ క్రమంలోనే గంటా శ్రీనివాసరావును కలిసి మద్దతు కోరారు.












Click it and Unblock the Notifications