బంగాళాఖాతంలో భూకంపం- విశాఖపట్నంలో కదిలిన నేల
బంగాళాఖాతంలో సంభవించిన భూకంపం ఏపీ తీర ప్రాంత ప్రజలను ఒక్కసారిగా భయాందోళనలకు గురిచేసింది. దీని ప్రభావంతో విశాఖపట్నంలోని పలు ప్రాంతాలలో స్వల్పంగా ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. ఉదయాన్నే నిద్రలేచే సమయంలో ఒక్కసారిగా నేల కదలడంతో ఇళ్లలో ఉన్న ప్రజలు ఆందోళనతో వీధుల్లోకి పరుగులు తీశారు. ఆ తర్వాత కూడా తేలికపాటి ప్రకంపనలు నమోదవడంతో ఇళ్లల్లోకి వెళ్లడానికి భయపడ్డారు.
రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 4.5గా నమోదైంది. ఈ తెల్లవారుజామున సరిగ్గా 5:05 నిమిషాల సమయంలో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. బంగాళాఖాతం సముద్రంలో సుమారు 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం సంభవించింది. కాకినాడకు తూర్పు దిశలో 227, రాజమండ్రికి 275, ఒడిశాలోని బెర్హంపూర్‌కు దక్షిణంగా 282, పూరీకి నైరుతి దిశలో 367 కిలోమీటర్ల దూరంలో గల ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించారు.

దీని తీవ్రత ఏపీ తీరానికే పరిమితం కాలేదు. పొరుగున ఉన్న ఒడిశాలోనూ కనిపించింది. తీరానికి దూరంగా భూమి ప్రకోపించినప్పటిెకీ.. దీని తీవ్రత విశాఖపట్నంపై పడింది. ఎంవీపీ కాలనీ, పెద వాల్తేరు, గాజువాక, ఎండాడ, అరిలోవ వంటి చోట్ల భూమి కంపించింది. ఇళ్లలోని సామాగ్రి కదలడంతో స్థానికులు భయభ్రాంతులకు లోనయ్యారు. ఎక్స్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లపై భూప్రకంపనల గురించి పోస్టులు పడ్డాయి.
ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం అందలేదు. సాధారణంగా సముద్రంలో తీవ్రమైన కంపనాలు వచ్చినప్పుడు సునామీ ముప్పు పొంచి ఉంటుందనే భయాలు వ్యక్తమవుతాయి. ఈ భూకంప తీవ్రత తక్కువగా ఉండటంతో ఎలాంటి ప్రమాద హెచ్చరికలను జారీ కాలేదు. భౌగోళికపరంగా బంగాళాఖాతంలో ఇటువంటి స్వల్ప స్థాయి ప్రకంపనలు సాధారణంగానే సంభవిస్తుంటాయి. కొద్దిరోజుల కిందటే అండమాన్ తీరంలోనూ 4.8 తీవ్రతతో భూమి కంపించిన విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications