జనసేనాని పవన్‌కల్యాణ్‌కు 'సెంటర్' నుంచి ఊహించని శుభవార్త!!
జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసు. అయితే రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి గాజు గ్లాసు గుర్తు ఉండదని, అందుకు తగ్గ ఓట్ల శాతాన్ని పొందలేకపోవడమే కారణమంటూ ప్రచారం జరిగింది. కేంద్ర ఎన్నికల సంఘం ఆ ప్రచారానికి చెక్ పెట్టింది. తాజాగా విడుదల చేసిన ఈసీ నివేదికలో ఏపీలో జనసేన పార్టీకి గాజు గ్లాసు గుర్తును కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది.

తిరుపతి ఉప ఎన్నికల్లో వేరేవారికి గుర్తు
ఎన్నికల సంఘం గుర్తింపు పొందడానికి అవసరమైనన్ని ఓట్లు, సీట్లను జనసేన పొందలేకపోయింది. ఈ కారణంతోనే పార్టీ ఆన్ రికగ్నైజ్డ్ పార్టీగా కొనసాగుతోంది. దీంతో గాజు గ్లాసు గుర్తు కూడా కేటాయించరంటూ రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రచారం జరిగింది. తిరుపతి లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో ఆ గుర్తును వేరే అభ్యర్థికి కేటాయించడంతో ఆ ప్రచారానికి బలం చేకూరినట్లైంది. తాజాగా ఈసీ నివేదికలో ఆ పార్టీకి గాజు గ్లాసు గుర్తే ఉండటంతో నేతలు కాస్తంత ఊపిరి పీల్చుకుంటున్నారు.

గుర్తు అదే ఉండటంతో తగ్గిన ఒత్తిడి
రాబోయే ఎన్నికల్లో విజయం సాధించేందుకు, కింగ్ మేకర్‌గా అవతరించేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ శతథా ప్రయత్నిస్తున్నారు. అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై, ముఖ్యమంత్రి జగన్‌పై తీవ్రస్థాయిలో నిప్పులు చెరుగుతున్నారు. వైసీపీ లేని ఏపీని త్వరలోనే ప్రజలు చూస్తారని ప్రకటిస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఎన్నికలకు ముందుగానే ఈసీ గుర్తు విషయమై ఒక స్పష్టతనివ్వడంతో ఆ పార్టీకి చాలావరకు ఒత్తిడి తగ్గింది.

విరాళాల సేకరణ
జనసేన ఆర్థికంగా కూడా ఇప్పుడిప్పుడే బలపడుతోంది. ఒక రాజకీయ పార్టీని నడపడానికి నిధులు సరిపోకపోతుండటంతో ఇటీవలే ప్రత్యేకంగా విరాళాల సేకరణను ఆ పార్టీ నేత నాగబాబు ప్రారంభించారు. ఆ పార్టీకి గతేడాది విరాళాలుగా రూ.22.36 కోట్లు రాగా, ఈ ఏడాది రూ.26.37 కోట్లు వచ్చినట్లు ఈసీకి నివేదించింది. పార్టీకి స్థిరాస్తుల రూపంలో రూ.1.01 కోట్లు, వాహనాలు రూ.66.37 లక్షలు, కార్యాలయ ఫర్నిచర్ రూ.56.34 లక్షలు, బీమాలల ద్వారా రూ.95.47 లక్షల ఆదాయం ఉందని, ప్రస్తుతానికి బ్యాంకులో రూ.7.60 కోట్ల నిల్వ ఉన్నట్లు ఆదాయ వివరాలద్వారా జనసేన తెలిపింది.












Click it and Unblock the Notifications