తార జువ్వ: భారత అమ్ములపొదిలోకి మరో అస్త్రం
భారత రక్షణ రంగం అమ్ములపొదిలోకి మరో అస్త్రం వచ్చి చేరింది. రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (DRDO), భారత వైమానిక దళం (IAF) సంయుక్తంగా గురువారం ఒడిశా తీరంలో 'టాక్టికల్ అడ్వాన్స్‌డ్ రేంజ్ ఆగ్మెంటేషన్ (TARA)' అనే గ్లైడ్ ఆయుధ వ్యవస్థను విజయవంతంగా పరీక్షించాయి. శత్రువుల భూతలా లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేసే ఈ స్వదేశీ పరిజ్ఞానం, భారత వైమానిక శక్తిని మరో స్థాయికి తీసుకెళ్తుందని రక్షణ శాఖ వెల్లడించింది.
తార (TARA) అనేది ఒక మాడ్యులర్ రేంజ్ ఎక్స్‌టెన్షన్ కిట్. దీని ప్రత్యేకత ఏమిటంటే.. ఇది సాధారణ అన్‌గైడెడ్ వార్‌హెడ్‌లను (సాధారణ బాంబులను) కూడా అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని చేధించే 'ప్రెసిషన్-గైడెడ్' ఆయుధాలుగా మారుస్తుంది. తక్కువ ఖర్చుతో గరిష్ట విధ్వంసక శక్తిని అందించడమే ఈ వ్యవస్థ ప్రధాన లక్ష్యం. విమానం నుంచి ప్రయోగించిన తర్వాత ఇది గాలిలో తేలుతూ (గ్లైడ్ అవుతూ) కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రువు స్థావరాలను గురితప్పకుండా వేటాడగలదు.

హైదరాబాద్ కేంద్రంగా రూపకల్పన
ఈ అత్యాధునిక వ్యవస్థను హైదరాబాద్‌లోని రీసెర్చ్ సెంటర్ ఇమారత్ (RCI) ఇతర DRDO ల్యాబ్‌ల సహకారంతో అభివృద్ధి చేసింది. స్వదేశీ సాంకేతికతతో, తక్కువ ఖర్చుతో కూడిన విడిభాగాలను ఉపయోగించి దీనిని రూపొందించారు. కేవలం ప్రయోగమే కాకుండా, దీనికి సంబంధించిన ఉత్పత్తి కార్యకలాపాలు కూడా అప్పుడే ప్రారంభమయ్యాయి. భారతీయ పరిశ్రమలు, డెవలప్‌మెంట్ కమ్ ప్రొడక్షన్ భాగస్వాములు (DcPP) ఈ ఆయుధ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
అభినందనల జల్లు
స్వదేశీ రక్షణ సామర్థ్యాలలో ఇదొక కీలకమైన మైలురాయి అని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కొనియాడారు. ఈ ఘనత సాధించిన DRDO, IAF, పారిశ్రామిక భాగస్వాములను ఆయన అభినందించారు. DRDO చైర్మన్ డాక్టర్ సమీర్ వి. కామత్ సైతం బృందం కృషీని అభినందిస్తూ, భవిష్యత్తు యుద్ధ తంత్రాల్లో 'తార' గేమ్ ఛేంజర్ కానుందని ధీమా వ్యక్తం చేశారు. సంప్రదాయ ఆయుధాలను అత్యంత వేగంగా, కచ్చితత్వంతో కూడిన గ్లైడ్ ఆయుధాలుగా మార్చే ఈ టెక్నాలజీ 'ఆత్మనిర్భర్ భారత్' లక్ష్యంలో మరో కీలక అడుగు.














Click it and Unblock the Notifications