"తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా విమానాశ్రయాల నిర్మాణాలు ఉండాలి"
రాష్ట్రంలోని వరంగల్, ఆదిలాబాద్ విమానాశ్రయ పనుల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి తాజాగా సమీక్ష నిర్వహించారు. ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు అలాగే దిల్లీలోని తెలంగాణ భవన్ నిర్మాణాలు తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా ఉండాలని తెలిపారు. తెలంగాణ సంస్కృతి ప్రతిరూపాలైన కాకతీయ కళాతోరణం, పిల్లలమర్రి, రామప్ప ఆలయం ప్రతిబింబించేలా ఉండాలని అధికారులకు సూచనలు చేశారు. ఈమేరకు భవిష్యత్ అవసరాల దృష్ట్యా సమగ్ర ప్రణాళిక రూపొందించుకోవాలని ఆదేశించారు. ఈ మేరకు ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు, దిల్లీలో తెలంగాణ భవన్ నిర్మాణాలపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం సమీక్ష నిర్వహించారు.
ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలు నిర్మించే ప్రాంతాల్లో ఉన్న విద్యుత్ లైన్ల మార్పు, వాగుల ప్రవాహం మార్పు, రహదారుల మళ్లింపు, బీఎస్ఎన్ఎల్ లైన్లు, తాగు నీటి సరఫరా లైన్ల మార్పు అంశాలను అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఆయా అంశాలపై పూర్తి వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి అధికారులకు పలు సూచనలు చేశారు. విమానాశ్రయాల కాంపౌండ్ వాల్ సమీపం నుంచి రహదారులు నిర్మించాలని, ఆ రహదారులను సమీప జిల్లా, రాష్ట్ర, జాతీయ రహదారులకు అనుసంధానం చేయాలని సూచించారు.
ఏ శాఖకు ఆ శాఖ విడివిడిగా పనులు చేపడితే, అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందన్నారు. విద్యుత్, ఆర్ అండ్ బీ, తాగు నీటి సరఫరా, నీటి పారుదల శాఖ అధికారులు సమావేశమై బీఎస్ఎన్ఎల్ అధికారులతో చర్చించి, ఏకకాలంలో పనులు సాగేలా చూడాలని సూచనలు చేశారు. ప్రస్తుత అవసరాలనే కాకుండా భవిష్యత్ అవసరాలను పరిగణనలోకి తీసుకొని సమగ్ర ప్రణాళిక రూపొందించుకొని పనులు ముందుకు సాగేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.

వాగులు, ఇతర నీటి ప్రవాహాలను మళ్లించాల్సి వస్తే, విమానాశ్రయాల ప్రాంగణం లేదా సమీపంలో చెరువులను నిర్మించి, అక్కడి నుంచి ప్రవాహాలను మళ్లించేలా చూడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. విమానాశ్రయాలకు వచ్చే, వెళ్లే రహదారులు విశాలంగా ఉండడంతో పాటు సమీపంలోని ముఖ్య రహదారులకు అనుసంధానించేలా నిర్మించాలని సీఎం ఆదేశించారు. నిర్దేశిత సమయంలో పనులు పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. ఆదిలాబాద్, వరంగల్ విమానాశ్రయాలతో పాటు దిల్లీ తెలంగాణ భవన్ నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశీలించారు. ప్రతి నిర్మాణంలోనూ తెలంగాణ సంస్కృతి, శిల్ప, వాస్తు కళలకు పెద్దపీట వేయాలని ఆదేశించారు. పలు ఆకృతుల్లో మార్పులను సీఎం సూచించారు.












Click it and Unblock the Notifications
