అయ్యో.. డీజే శబ్దాలకు ఆగిన చిన్నారి గుండె.. క్లాస్ రూమ్ లోనే..
ప్రస్తుతం ఎక్కడ చూసినా వినాయక నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా వినాయకుడి మండపాల వద్ద పెద్ద పెద్ద శబ్దాలతో డీజే పాటలు పెట్టడం మనం చూస్తూనే ఉంటాం. ఈ శబ్దాలు ప్రమాదకరం అని తెలిసినా కొందరు మాత్రం అవేమీ పట్టించుకోకుండా డీజేలను పెడుతుంటారు. అయితే ఉత్తర్ ప్రదేశ్ లోని బలరాంపూర్‌లో తాజాగా షాకింగ్ ఘటన జరిగింది. డీజే శబ్దాలకు క్లాస్ రూమ్ లోనే విద్యార్థిని మృతి చెందింది. అంతసేపూ క్లాస్ రూమ్ లోని తోటి విద్యార్థులతో సరదాగా ఆడి పాడిన చిన్నారి ఒక్క సెకను వ్యవధిలోనే అలాగే కుర్చీలో కుప్పకులిపోయింది. అయితే అది గమనించిన పాఠశాల సిబ్బంది వెంటనే చిన్నారిని సమీప ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అప్పటికే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతి చెందిన చిన్నారి వైష్ణవి తివారి అని తెలుస్తోంది.
ఇక చిన్నారి వైష్ణవి మృతితో కుటుంబ సభ్యుల ఆర్తనాదాలు మిన్నంటాయి. డీజే శబ్దాల కారణంగానే తమ కూతురు చనిపోయిందని తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. వైష్ణవి మృతికి అసలు కారణాలు విచారణ తర్వాతే తేలుతుందని పోలీసులు స్పష్టం చేశారు. ఈ ఘటన సెప్టెంబర్ 21 సోమవారం ఉదయం 11 గంటల సమయంలో జరిగిందని వివరించారు. చిన్నారి వైష్ణవి తివారి రెండో తరగతి చదువుతోందని.. ఇక సోమవారం ఉదయం వినాయకుడి విగ్రహం ఆ స్కూల్ పక్కనుంచే పెద్ద పెద్ద డీజే శబ్దాలతో వెళ్లినట్లు పాఠశాల యాజమాన్యం స్పష్టం చేసింది.

ఇక వైష్ణవి తివారి క్లాస్ రూమ్ లోనే కుప్పకూలిన దృశ్యాలు స్థానిక సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. డీజే శబ్దాలకు మొదట వైష్ణవి కుర్చీలో తల వెనక్కు పెట్టి పడిపోయింది. పక్కన కూర్చొన్న ఓ బాలుడు వైష్ణవి తివారిని లేపేందుకు ప్రయత్నించగా చిన్నారిలో కాస్త చలనం వచ్చింది. దాంతో కుర్చీలో కూర్చొనేందుకు ప్రయత్నించింది. కానీ అంతలోనే ఓ వైపునకు మొత్తం పడిపోయింది. ఈ దృశ్యాలు మొత్తం సీసీకెమెరాల్లో రికార్డు అయ్యాయని స్కూల్ అడ్మినిస్ట్రేటర్ అశిష్ ఉపాధ్యాయ తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుగుతోంది.












Click it and Unblock the Notifications
