ఏపీలో ఉప ఎన్నిక - షెడ్యూల్ విడుదల : మార్చి 24న పోలింగ్..!!
ఏపీలో మరో ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల అయింది. కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు షెడ్యూల్ ను ప్రకటించింది. ఏపీ శాసనమండలిలో ఎమ్మెల్సీగా ఉంటూ హఠాన్మరణం చెందిన కరీమున్నీసా స్థానం భర్తీ కోసం ఈ ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల చేసారు. ఈ ఎన్నికకు సంబంధించి మార్చి 7న నోటిఫికేషన్ జారీ కానుంది. మార్చి 14వ తేదీ వర్కు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. మార్చి 15న స్క్రూటినీ నిర్వహించనుండగా.. మార్చి 17 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేది కానుంది.
మార్చి 24న ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది. కరీమున్నీసా స్థానాన్ని ఆమె కుమారుడితో భర్తీ చేయాలని ఇప్పటికే సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే వైసీపీ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ స్థానం ఏకగ్రీవం కానుంది. ఇక, ఇదే సమయంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానం సైతం ఖాళీ అయినట్లుగా అసెంబ్లీ నోటిఫై చేసింది. ఇదే సమాచారాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించింది.

ప్రస్తుతం అయిదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నాయి. మార్చి 10వ తేదీన ఎన్నికల ఫలితాల తరువాత అయిదు రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. ఆ తరువాత దేశ వ్యాప్తంగా ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన స్థానాల పైన ఎన్నికల సంఘం కసరత్తు చేయనుంది. అందులో భాగంగా ఆత్మకూరుకు సంబంధించిన ఉప ఎన్నిక పైనా నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. అయితే, ఆరు నెలల్లోగా ఉప ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో.. మే నెలాఖరు లేదా జూన్ లో ఆత్మకూరుకు ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే, ఆత్మకూరులో మంత్రిగా ఉంటూ గౌతమ్ రెడ్డి హఠాన్మరణం చెందటంతో అక్కడ ప్రధాన పార్టీల నుంచి పోటీ ఉండే అవకాశం లేదు. అదే సమయంలో వైసీపీ సైతం మేకపాటి కుటుంబానికి ఆ సీటు కేటాయించటం ఖాయంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications