ఏపీ ఎన్నికలకు చురుగ్గా ఈసీ ఏర్పాట్లు-మార్చిలో నోటిఫికేషన్.. !
ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల ఎన్నికల బిజీలో ఉన్న కేంద్ర ఎన్నికల సంఘం.. వచ్చే నెలలో ఇవి పూర్తి కాగానే ఏపీతో పాటు మరికొన్ని రాష్ట్రాల ఎన్నికలకు రంగం సిద్దం చేస్తోంది. ఇప్పటికే ఏపీలో ఓటర్ల జాబితాల్ని సవరించి ముసాయిదాను నిన్న ప్రచురించిన ఎన్నికల సంఘం.. వీటిపై అభ్యంతరాలు స్వీకరించి డిసెంబర్ కల్లా పరిష్కారం చూపించనుంది. అనంతరం వచ్చే ఏడాది ఆరంభంలో ఏపీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయబోతోంది.

ఏపీలో అసెంబ్లీ ఎన్నికల దిశగా ఇప్పటికే ఈసీ వేగంగా అడుగులేస్తోంది. ముందు జమిలి ఎన్నికల నిర్వహణకు వీలుగా ఏర్పాట్లు చేసుకున్న ఈసీ.. అనంతరం కేంద్రం మందుకు రాకపోవడంతో అసెంబ్లీ గడువు ముగిశాక ఎన్నికల నిర్వహణ కోసం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే ఆగస్టులో ప్రారంభించిన ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఇప్పటికే కొత్త ఓటర్ల నమోదు పూర్తి చేసిన ఎన్నికల సంఘం.. తాజాగా ముసాయిదా ఓటర్ల జాబితాను వెల్లడించింది.
ఇప్పుడు వాటిలో అభ్యంతరాల్ని డిసెంబర్ వరకూ స్వీకరించి అనంతరం వాటిని పరిష్కరించనుంది. ఆ తర్వాత జనవరి మొదటివారంలోనే తుది ఓటర్ల జాబితాను ప్రచురించబోతోంది. దీని ఆధారంగా వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఏపీ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సిద్దమవుతోంది. ఇదే క్రమంలో వచ్చే ఏడాది మార్చిలో ఏపీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా తాజాగా సంకేతం ఇచ్చారు.
ఈ లెక్కన మార్చిలో ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ వస్తే ఏప్రిల్ లోనే ఎన్నికలు ఉండొచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కూడా కేవలం షెడ్యూల్ ప్రకటించిన నెల రోజుల్లోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో ఏపీలోనూ షెడ్యూల్ ప్రకటన తర్వాత నెల రోజుల వ్యవధిలోనే ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు ఈసీ విస్తృత ఏర్పాట్లు చేస్తోంది.












Click it and Unblock the Notifications