పురందేశ్వరి ఫిర్యాదుపై ఈసీ కీలక నిర్ణయం..!!
ఏపీలో ఎన్నికల సమయంలో కీలక పరిణమాలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి చేసిన ఫిర్యాదు పైన ఎన్నికల సంఘం స్పందించింది. ఈ లేఖపైన ప్రభుత్వ స్పందన చెప్పాలని సూచించింది. రాష్ట్రంలో స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకు అడ్డుగా ఉన్నారంటూ 22 మంది ఐపీఎస్ అధికారులపై పురందేశ్వరి ఫిర్యాదు చేసారు. సీఎస్, డీజీపీ పైన పురందేశ్వరిలో ఫిర్యాదు చేయటంతో ఈసీ నిర్ణయం ఏంటనేది కీలకంగా మారుతోంది.
పురందేశ్వరి ఫిర్యాదు
ఏపీలో అధికారుల పై పురందేశ్వరి రాసిన లేఖ పైస్పందన వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి లేఖ రాసింది. రాష్ట్రంలో డీజీపీ పోస్టుకు అరడజను మంది అర్హులైన సీనియర్లు ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి సొంత జిల్లా, ఆయన సామాజిక వర్గానికి చెందిన జూనియర్ అధికారి కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డిని డీజీపీగా రెండేళ్లకుపైగా అదనపు పూర్తి బాధ్యతల్లో కొనసాగించడానికి ప్రధాన కారణం ఆయన వైసీపీ సానుభూతిపరుడు అవడమేనని పేర్కొన్నారు. గత రెండేళ్లలో వైసీపీకి ఆయన ఏ విధంగా సహకరించారో కొన్ని ఆధారాలు పొందుపరిచారు. ముఖ్యమంత్రి పర్యటనకు భారీ భద్రత కల్పిస్తూ దేశ ప్రధాని మోదీ సభకు కనీస రక్షణ చర్యలు చేపట్టలేదన్నారు. వైసీపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్న డీజీపీని తక్షణమే మార్చేయాలని కోరారు.

స్పందించిన ఎన్నికల సంఘం
22 మంది ఐపీఎస్ లతో పాటు సీఎస్ జవహర్‌రెడ్డిపైనా పురందేశ్వరి తన లేఖలో ఈసీకి ఫిర్యాదు చేశారు. ఆయన కూడా సీఎం జిల్లాకు చెందినవారని.. అదే సామాజిక వర్గమని, ఎన్నికల కమిషన్ రంగంలోకి దిగేవరకూ రాష్ట్రంలో దొంగ ఓట్లపై చర్యలు తీసుకోలేదని తెలిపారు. కేంద్రం పంచాయతీలకు ఇచ్చిన నిధులను దారి మళ్లించారని.. వైసీపీ ఓటుబ్యాంకు పెంచారని.. స్వేచ్ఛాయుత ఎన్నికలు జరగాలంటే ఈ ఇద్దరితోపాటు ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పలువురు ఐపీఎస్ అధికారులను మార్చాలని కోరారు. అలాగే టీటీడీ ఈవో ధర్మారెడ్డి, విజిలెన్స్ అధిపతి కొల్లి రఘురామిరెడ్డి, రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి తదితరుల వ్యవహార శైలిపైనా ఆధారాలు జతచేశారు.

ఈసీ చర్యలు ఉంటాయా
ఎన్నికల సంఘం లేఖ పైన ప్రభుత్వం సమాధానం ఇవ్వనుంది. ప్రభుత్వం ఇచ్చే సమాధానం ఆధారంగా ఎన్నికల సంఘం పురందేశ్వరి ఫిర్యాదు పైన నిర్ణయం తీసుకొనే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే, ఇప్పటికే కొందరి అధికారులను బదిలీ చేస్తూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. కాగా, పురందేశ్వరి ఆరోపణల వ్యవహారం రాజకీయంగా దుమారానికి కారణమైంది. పురందేశ్వరి అధికారుల పైన ఆరోపణలు చేయటం పైన వైసీపీ సీరియస్ గా స్పందించింది. ఇక, ఇప్పుడు ఎన్నికల సంఘం తీసుకొనే నిర్ణయం పైన రాజకీయంగా ఆసక్తి కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications