అసెంబ్లీకి గైర్హాజరైన వైసీపీ ఎమ్మెల్యేలపై సంచలన నిర్ణయం..!!
ఏపీలో రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కీలక సమీకరణాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి- వైసీపీ కొత్త వ్యూహాలను అమలు చేస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి దూరంగా ఉంటున్నారు. అయితే, కొందరు సభ్యులు సభకు వచ్చిన ట్లుగా సంతకాలు చేసి.. సమావేశాలకు గైర్హాజరు అవుతున్నారు. వైసీపీ సభ్యుల తీరు పైన అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశం అయి చర్చించింది. కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో... ఇప్పుడు వైసీపీ ఏం చేస్తుందనేది ఆసక్తి కరంగా మారుతోంది.
2024 ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లకు పరిమితం అయింది. అసెంబ్లీ సీట్ల సంఖ్యలో 10 శాతం సీట్లు రాకపోవటంతో ప్రతిపక్ష హోదా దక్కలేదు. అయితే, సభలో మిగిలిన సభ్యులంతా అధికార కూటమి సభ్యులు కావటంతో.. తమకే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. ఇదే అంశం పైన కోర్టుకు వెళ్లింది. అసెంబ్లీలో సభ్యులుగా ప్రమాణ స్వీకారం వేళ.. గవర్నర్ ప్రసంగాల సమయంలో మాత్రమే వైసీపీ సభ్యులు సభకు హాజరయ్యారు.

అయితే, వైసీపీ సభ్యుల్లో మాజీ సీఎం జగన్ మాత్రమే ఎమ్మెల్యేగా జీతం తీసుకోవటం లేదని సభలోనే స్పీకర్ ప్రకటించారు. కాగా, మిగిలిన సభ్యుల్లో కొందరు సభకు హాజరు కాకుండానే... హాజరైనట్లుగా సంతకాలు చేస్తున్నారని.. జీత భత్యాలు తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. కాగా, ఇదే విషయం పైన అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ సమావేశం అయి చర్చించింది.
వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరు కాకుండా రిజిస్టర్‌లో సంతకాలు చేసి, జీతభత్యాలు తీసుకో వడంపై శాసనసభ ఎథిక్స్ కమిటీ దృష్టి సారించింది. వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా రిజిస్టర్ లో సంతకాలు పెట్టడం, జీతభత్యాలు తీసుకోవడం, అలాగే ఎమ్మెల్యేలు బహిరంగ వేదికలు, సామాజిక మాధ్యమాల్లో అసభ్యపదజాలం వాడటంపైనా చర్చ జరిగింది. ఎమ్మెల్యేల హాజరు పట్టీని సమీక్షించారు. ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటూ సభకు రావటం లేదని కమిటీ నిర్ధారించినట్లు తెలుస్తోంది.
దీని పైన పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించింది. ముందుగా ఆ ఆరుగురు వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి కమిటీ ముందు వివరణ తీసుకోవా లని నిర్ణయం తీసుకున్నారు. ఆ తరువాత వారిచ్చిన వివరణతో పాటుగా.. నిపుణుల అభిప్రాయం తీసుకొని సభ ముందు ఉంచాలని డిసైడ్ అయ్యారు. దీంతో.. ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలకు ఎథిక్స్ కమిటీ నుంచి వచ్చే నోటీసులకు ఇచ్చే సమాధానాలు.. వీటికి అనుగుణంగా తీసుకునే చర్యల పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications