కమ్మవారికి ఎటువంటి సంకేతాలు పంపుతున్నారు మీరు?
గుంటూరు- విజయవాడ మధ్య అమరావతి రాజధానిగా ఉండటం అత్యంత హర్షణీయమని మాజీ హోం మంత్రి వసంత నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. అమరావతి అనేది రాష్ట్రాభివృద్ధికి చిహ్నమని అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరంలో వసంత నాగేశ్వరరావు విలేకరులతో మాట్లాడారు. రూపాయి తీసుకోకుండా రాజధాని కోసం 32వేల ఎకరాలు ఇచ్చారని, ఇటువంటి ఘనత ప్రపంచంలో ఎక్కడా జరగలేదని చెప్పారు. 29 గ్రామాలకు చెందిన రైతులు తమ భూములను అమరావతి కోసం త్యాగం చేశారని, అందుకే తాను వారికి జేజేలు పలుకుతున్నట్లు తెలిపారు. విజయవాడలో రైల్వే జంక్షన్, విమానాశ్రయంతో పాటు కృష్ణా నది అందుబాటులో ఉందని, రాజధానికి అది అనువైన ప్రాంతమన్నారు. ఏ రాజధానికైనా తాగునీరు ప్రధానమని, అది కృష్ణా నది రూపంలో అందుబాటులో ఉందని, ఇంతకంటే మంచి ప్రదేశం రాజధానికి ఉండదన్నారు.
రాయలసీమకు, ఉత్తరాంధ్రకు సమాన దూరంలో అమరావతి ఉందని, సరిగ్గా రాష్ట్రం మధ్యలో ఉందన్నారు. అన్ని జిల్లాలవారికీ అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో కమ్మ సామాజిక వర్గానికి ప్రాధాన్యం లేకపోవడం బాధాకరమని వసంత నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. కమ్మవారు ఉన్న రాష్ట్రంలోనే మంత్రి లేకపోతే ఆ సామాజిక వర్గానికి ఎటువంటి సంకేతాలు ఇచ్చినట్లవుతుందని ప్రశ్నించారు. అన్ని సామాజిక వర్గాలకు మంత్రివర్గంలో ప్రాధాన్యం ఇవ్వాలని, అప్పుడే సామాజిక సమతూకం పాటించినట్లవుతుందన్నారు. వసంత నాగేశ్వరరావు కుమారుడు వసంత కృష్ణప్రసాద్ కృష్ణా జిల్లా మైలవరం నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ అమరావతి ప్రాంతానికి చెందిన 29 గ్రామాల రైతులు పాదయాత్ర చేస్తున్నారు. అయితే అనివార్య కారణాలతో దీన్ని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురం దగ్గర నిలిపివేశారు. యాత్రకు ఎటువంటి అడ్డంకులు ఎదురు కాకుండా కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకొని త్వరలోనే యాత్రను పున:ప్రారంభించబోతున్నారు.












Click it and Unblock the Notifications