మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక నిర్ణయం - ఇక ఉద్యమమే, టార్గెట్ ఎవరు..!!
ఏపీలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. ప్రధాన పార్టీలతో పాటుగా కొత్త పార్టీల వ్యూహాలు..కార్యాచరణ ఆసక్తిని పెంచుతున్నాయి. వైసీపీని ఓడించేందుకు టీడీపీ, జనసేన ఒక్కటయ్యాయి. తన సంక్షేమం, సామాజిక న్యాయం మరో సారి అధికారం ఇస్తాయని జగన్ ధీమాగా ఉన్నారు. ఈ సమయంలోనే కొత్తగా పార్టీ ప్రకటించిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కీలక ప్రకటన చేసారు. మాజీ జేడీ అడుగులు రాజకీయం గా ఎవరికి నష్టం చేస్తాయనే చర్చ మొదలైంది.
ప్రత్యేక హోదా లక్ష్యంగా
ఏపీలో జై భారత్ (ఎన్) పార్టీ అద్యక్షుడు జేడీ లక్ష్మీనారాయణ కీలక కార్యాచరణ ప్రకటించారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకహోదాపై తమ పార్టీ పోరాటం చేస్తుందని పార్టీ ఆవిర్భావం సమయంలోనే మాజీ జేడీ స్పష్టం చేసారు. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వడం కేంద్రం బాద్యతని చెప్పారు. స్పెషల్ స్టేటస్ అద్యాయం అయిపోయింది అంటున్నారు.. కాదు ఇప్పుడే మొదలైందని చెప్పుకొచ్చారు. పార్లమెంట్‌లో ఏపీకి హోదా ఐదేళ్లు కావాలని అప్పటి ప్రభుత్వం చెబితే... కాదు పదేళ్లు కావాలని బీజేపి చెప్పిన విషయాన్ని లక్ష్మీనారాయణ గుర్తు చేశారు.

మాజీ జేడీ నిర్ణయం
పార్లమెంట్‌లో ఇచ్చిన హామీలు అమలుచేయలేనప్పుడు ఇక పార్లమెంట్‌కు విలువేముంటుందని లక్ష్మీనారాయణ ప్రశ్నించారు. ఎన్నికల కోసం మాత్రమే హోదా అంశాన్ని టీడీపీ, వైసీపీలు లేవనెత్తున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ప్రత్యేక హోదా సాధన కోసం బ్యాడ్జీలు ధరించి పోరాటం చేద్దామని పిలుపిచ్చారు. పొలిటికల్ పార్టీ నేతలకు కూడా బ్యాడ్జీలు పెట్టాలన్నారు. ఈరోజు నుంచి తాను ఈ బ్యాడ్జీని తగిలిస్తానన్నారు. జనవరి 26న (రిపబ్లిక్ డే రోజు) ప్రత్యేక హోదా కోసం ప్రతిజ్ఞ చేద్దామని సూచించారు.
ఎన్నికల వేళ కీలకంగా
తమిళనాడులో జల్లికట్టు కోసం ఉద్యమం చేసి సాధించారని.. అలాగే ప్రత్యేక హోదా కోసం రాజకీయ పార్టీలు కాకుండా ప్రజలు ఉద్యమిస్తేనే హోదా వస్తుందని జేడీ లక్ష్మీనారాయణ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీలో ప్రధాన పార్టీలు దాదాపు ఏపీకి ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ప్రస్తావించటం లేదు. ఈ సమయంలో మాజీ జేడీ ఈ ప్రస్తావనతో పాటుగా చేస్తున్న వ్యాఖ్యలతో మరోసారి ఎన్నికల వేళ ఈ అంశం ప్రధాన ప్రచారాస్త్రంగా మారే అవకాశం కనిపిస్తోంది. హోదా విషయంలో జరిగే చర్చ ద్వారా ఏ పార్టీకి నష్టం చేస్తుంది..మాజీ జేడీ ఏ మేర బలంగా ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తారనేది చూడాలి.












Click it and Unblock the Notifications