మీ ఎన్నిక... మా భాగ్యం!: లేఖలో వెంకయ్యపై కన్నడ కాంగ్రెస్ సీనియర్ నేత
హైదరాబాద్: సుదీర్ఘ రాజకీయ జీవితం. ఇప్పటి వరకు ఆయనపై ఎటువంటి వ్యక్తిగత ఆరోపణలు దాదాపుగా రాలేదనే చెప్పాలి. ఒక్క మాటలో చెప్పాలంటే దేశ రాజకీయాల్లో ఆయన్ని ఆజాత శత్రువనే చెప్పొచ్చు. ఆయనే బీజేపీ సీనియర్ నేత, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు.
ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లాకు చెందిన వెంకయ్య నాయుడు జాతీయ స్థాయి రాజకీయాల్లో సమర్ధవంతమైన నేతగా ఎదిగారు. అయితే ఆయనకు తన సొంత రాష్ట్రంలో ప్రజల నుంచి వ్యతిరేకత ఎదురైనా... పొరుగు రాష్ట్రమైన కర్ణాటక నుంచి మూడు సార్లు ఆయన రాజ్యసభకు ఎంపికయ్యారు.
తాజాగా మరోమారు కర్ణాటక నుంచి ఆయన్ను రాజ్యసభకు పంపించేందుకు బీజేపీ పెద్దలు అంగీకరించారు. వరుసగా నాలుగు సార్లు రాజ్యసభకు వెళ్లనున్న బీజేపీ నేతగా కూడా ఆయన అరుదైన రికార్డుని సృష్టించనున్నారు. బీజేపీలో ఇప్పటి వరకు వరుసగా నాలుగు సార్లు రాజ్యసభకు ఎన్నికైన నేత లేరు.

అంతేకాదు ఒక నేతను మూడు సార్లే రాజ్యసభ సభ్యత్వం అన్న పరిమితిని కూడా బీజేపీ జాతీయ నాయకత్వం వెంకయ్య విషయంలో సడలించింది. దీనిని బట్టి చూస్తే కర్ణాటకకు చెందిన నేతగా ఏకంగా 24 ఏళ్లపాటు రాజ్యసభలో కొనసాగిన నేతగా కూడా వెంకయ్య రికార్డు సృష్టించనున్నారు.
ఈ క్రమంలో వెంకయ్య అభ్యర్థిత్వంపై కన్నడిగులు హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి హర్షం వ్యక్తం చేయడం గమనార్హం.
కాగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన కన్నడ నేత, కేంద్ర మాజీ మంత్రి ఎంవీ రాజశేఖరన్ ఇటీవలే వెంకయ్య నాయుడికి ఓ లేఖ రాశారు. అందులో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వెంకయ్యను కర్ణాటక కోటా నుంచి రాజ్యసభకు ఎన్నిక కావడం కన్నడిగుల భాగ్యమని రాజశేఖరన్ ఆ లేఖలో వ్యాఖ్యానించారు.
కర్ణాటక రాష్ట్ర అభివృద్ధికి వెంకయ్య పాటుపడతారన్న నమ్మకం తనకుందని కూడా ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏ పదవిలో ఉంటే ఆ పదవికి వెంకయ్య వన్నె తెచ్చారని కూడా రాజశేఖరన్ ఆ లేఖలో వ్యాఖ్యానించడం విశేషం.












Click it and Unblock the Notifications