ఆడుదాం ఆంధ్రలో అవినీతిని వెలికి తీస్తాం: మంత్రి
ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ పై మంత్రిగా ఉన్న సమయంలో తీవ్రస్థాయిలో దుర్భాషలాడిన మాజీ మంత్రి ఆర్కే రోజా చిక్కుల్లో పడ్డారు. గత ప్రభుత్వంలో ఆమె పర్యాటక శాఖ, కీడ్రల శాఖ మంత్రిగా వ్యవహరించారు. 'ఆడుదాం ఆంధ్రా' పేరుతో రాష్ట్రవ్యాప్తంగా ఆటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రూ.100 కోట్ల అవినీతి జరిగిందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో 'ఆడుదాం ఆంధ్రా'లో జరిగిన అక్రమాలను గుర్తించేందుకు ప్రస్తుత క్రీడల శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఓ కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ ఇచ్చే నివేదిక ప్రకారం దోషులను గుర్తించి వాటిని రికవరీ చేయడంతోపాటు అక్రమాలకు పాల్పడినవారిని అరెస్ట్ చేస్తామని ఆయన ప్రకటించారు.
అరెస్ట్ అయ్యే అవకాశాలే ఎక్కువ
2014-19 కాలంలో రాజధాని అమరావతిలో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందంటూ రోజా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. వాటిని నిరూపించాలంటూ మంత్రి రాంప్రసాద్ రెడ్డి సవాల్ విసిరారు. రోజా చేసిన వంద కోట్ల రూపాయల అవినీతిని తాను నిరూపిస్తామని స్పష్టం చేశారు. ఇటీవలే జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రోజా నగరి నుంచి పోటీచేసి ఓటమి పాలయ్యారు. ప్రభుత్వం మారిన వెంటనే 'ఆడుదాం ఆంధ్రా'లో అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు వచ్చాయి.

హామీలపై దృష్టి పెట్టండి
అయితే ఈరోజు తాడేపల్లిలో విలేకరులతో మాట్లాడిన రోజా తనపై వస్తున్న విమర్శలను ఖండించారు. 'ఆడుదాం ఆంధ్ర'కు అయిన ఖర్చు రూ.100 కోట్లు అయితే స్కామ్ కూడా రూ.100 కోట్లు జరుగుతుందా? అంటూ ఎద్దేవా చేశారు. స్కామ్ అంటే ఇలా కూడా చేస్తారా? అని ప్రశ్నించారు. టెండర్లు కూడా తమ క్రీడా శాఖ నిర్వహించలేదని, అలాంటిది తాను, బైరెడ్డి సిద్దార్థరెడ్డి అవినీతికి పాల్పడ్డామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికల ఫలితాలు వెల్లడైన తర్వాత వైసీపీ శ్రేణులపై దాడులు చేస్తున్నారని, ఇది సరికాదని, దాడులు ఆపి ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంపై ప్రభుత్వం దృష్టిపెట్టాలని సూచించారు.












Click it and Unblock the Notifications