మొసలి కన్నీరు కారుస్తున్న 'ఉండవల్లి'..!
రామోజీ గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు మృతిపట్ల మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మొసలి కన్నీరు కారుస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు మండిపడుతున్నారు. రామోజీరావు మృతిపై ఉండవల్లి దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. దీనిపై సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్న రామోజీ ఆర్థిక మూలాలను దెబ్బకొట్టాలనే లక్ష్యంతో వైఎస్ ఉండవల్లిని ఉపయోగించుకున్నారు.
గట్టిగా పోరాడిన రామోజీ
ఉండవల్లి కేసులను ప్రాతిపదికగా చేసుకొని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రామోజీని అరెస్ట్ చేయడమే లక్ష్యంగా పావులు కదిపారు. ఏపీ సీఐడీ మార్గదర్శి కార్యాలయాల్లో సోదాలు నిర్వహించడంతోపాటు ఆయన చికిత్స పొందుతున్న ఆసుపత్రికి వెళ్లి మరీ విచారించింది. ఆసుపత్రిలో బెడ్ పై ఉన్న ఫొటోలను మీడియాకు లీక్ చేయించారు. ఇవన్నీ కూడా ఉండవల్లి అరుణ్ కుమార్ మార్గదర్శిపై పెట్టిన కేసులను ప్రాతిపదికగా చేసుకొని జరిగినవే. అయితే ఇటువంటివాటికి రామోజీరావు బెదిరిపోలేదు. వారిపై గట్టిగా పోరాడారు.

పరోక్షంగా సలహాలు, సూచనలు
రామోజీరావును అరెస్టే జగన్ లక్ష్యమని.. ఏపీ పోలీసులు రామోజీని అరెస్ట్ చేసేందుకు వస్తారని, అందుకు తెలంగాణ పోలీసులు సహకరించాలంటూ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ ను జగన్ రెడ్డి కోరారని, అయితే అందుకు కేసీఆర్ అంగీకరించలేదని మాజీ మంత్రి కేటీఆర్ ఓ సందర్భంగా కుండబద్ధలు కొట్టినట్లు చెప్పారు. వైఎస్ జగన్ కోసం రామోజీరావుపై కేసులు పెట్టిన ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి పరోక్షంగా జగన్ ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇచ్చేవారని నెటిజన్లు గుర్తుచేస్తున్నారు. ఇప్పుడు రామోజీరావు మృతిపై సంతాపం తెలియజేస్తున్నానంటూ మీడియా ముందుకు రావడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. మొసలి కన్నీరు కారుస్తున్నావు.. ఇక ఆపు అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు. ఉండవల్లి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడంటూ మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications