కోనసీమలో మరో బ్లో అవుట్..! ఎగసిపడుతున్న మంటలు..!
ఏపీలోని కోనసీమలో ఇవాళ మరో బ్లోఅవుట్ జరిగింది. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండ వద్ద ఓఎన్‌జీసీ పైపులైన్ నుంచి గ్యాస్ భారీగా లీక్ అయింది. దీంతో మంటలు అంటుకుని చుట్టుపక్కల వ్యాపిస్తున్నాయి. గతంలో పాశర్లపూడిలో జరిగిన బ్లోఅవుట్ ను ఇక్కడి ప్రజలు మర్చిపోలేదు. ఈ నేపథ్యంలో కోనసీమలో ఎప్పుడు బ్లోఅవుట్ జరిగినా ఇక్కడ ప్రజల్లో అవే అనుభవాలు గుర్తుకొస్తుంటాయి.
ఇవాళ మధ్యాహ్నం మలికిపురంలోని ఇరుసుమండ గ్రామంలో ఓఎన్‌జీసీ డ్రిల్లింగ్ సైట్ నుంచి గ్యాస్ లీకైంది. దాదాపు రెండు గంటలుగా వరుసగా గ్యాస్ లీక్ అవుతుండటంతో అగ్ని కీలలు చెలరేగాయి. గ్యాస్ లీక్ కారణంగా గాల్లో వాయువు వ్యాపిస్తోంది. ఘటన తెలియగానే గ్రామస్థులు ఓఎన్‌జీసీ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వారు సైట్ కు చేరుకుని గ్యాస్ లీక్ ను నియంత్రించేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు.

కోనసీమలో గ్యాస్ లీక్ ఘటనతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు ఒక్కసారిగా భయాందోళనలకు గురవుతున్నారు. స్థానిక అధికారులతో పాటు ఓఎన్‌జీసీ సిబ్బంది కూడా అక్కడికి చేరుకున్నారు. రాజమండ్రి నుంచి ఓఎన్‌జీసీ నిపుణుల బృందాన్ని రప్పిస్తున్నారు. అయితే కోనసీమలో గ్యాస్ లీక్ ఘటనలు తరచుగా జరుగుతుండటంతో జనంలో ఆందోళన పెరుగుతోంది. ఓఎన్‌జీసీ అధికారులు ఇలాంటి ఘటనలు జరగకుండా నియంత్రించడంలో విఫలమవుతున్నారన్న విమర్శలూ ఉన్నాయి.
అయితే ఇవాళ జరిగిన గ్యాస్ లీక్ వెనుక కారణాలపై చర్చ జరుగుతోంది. ఉత్పత్తిలో ఉన్న బావి ఆగిపోవడంతో వర్క్ అవర్ రిగ్గుతో చేస్తుండగా ఒక్కసారిగా భారీ ఎత్తున క్రూడ్ తో కూడిన గ్యాస్ ఎగజిమ్మినట్లు తెలుస్తోంది. దీంతో గ్రామంలోకి మంచు మాదిరిగా గ్యాస్, పొగ చొచ్చుకొస్తున్నాయి. దీంతో పరిసర గ్రామాల ప్రజల ఇళ్లు ఖాళీ చేయిస్తున్నారు. భయాందోళనలు అక్కర్లేదని అధికారులు చెప్తున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications