AP Panchayat elections: ఓటింగ్ సరళిపై వెబ్ కాస్టింగ్ నిఘా..డ్రోన్లతో పర్యవేక్షణ
అమరావతి: రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఆరంభమైంది. ఉదయం 6:30 గంటలకు 12 జిల్లాల్లో 29,732 పోలింగ్ స్టేషన్లలో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పలు కేంద్రాల ముందు ఓటర్లు బారులు తీరి నిల్చున్నారు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. 2,723 పంచాయతీలు, 20,157వార్డులకు పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 3:30కు పోలింగ్ ముగుస్తుంది. కరోనా వైరస్ బారిన పడిన వారు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించారు.
Recommended Video
చివరి గంట అంటే మధ్యాహ్నం 2:30 నుంచి 3:30 గంటల వరకు కరోనా పేషెంట్లకు ఓటు వేసే అవకాశం ఇచ్చారు. వారికి ఎన్నికల సిబ్బంది పీపీఈ కిట్లను అందిస్తారు. సాయంత్రం 4 గంటల నుంచి ఓట్ల లెక్కింపును చేపడతారు. ఆ వెంటనే- ఫలితాలను వెల్లడిస్తారు. సర్పంచ్ ఎన్నికను అధికారికంగా ప్రకటిస్తారు. అనంతరం ఉపసర్పంచ్ ఎన్నిక ఉంటుంది. ఈ ఎన్నికల్లో నోటా వ్యవస్థను అమల్లోకి తీసుకొచ్చారు. పంచాయతీ ఎన్నికల్లో నోటాను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి.

పోలింగ్ కేంద్రం నుంచి అయిదు కిలోమీటర్లకు పైగా ఉన్న ఓటర్ల కోసం రవాణా వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీనికోసం 2,216 వాహనాలు ఏర్పాటు చేశారు. ఓటర్లు, పోలింగ్ స్టేషన్ సిబ్బంది తప్పనిసరిగా కరోనా వైరస్ ప్రొటోకాల్‌ను అనుసరించాల్సి ఉంటుంది..మాస్క్‌ను ధరించడం పోలింగ్ కేంద్రంలోకి వెళ్లబోయే ముందు శానిటైజర్లతో చేతులను శుభ్రం చేసుకోవడం తప్పనిసరి చేశారు.
పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తును ఏర్పాటు చేశారు. దీన్ని పర్యవేక్షించడానికి పోలీస్ డైరెక్టర్ జనరల్ కార్యాలయంలో రాష్ట్ర స్థాయి కమాండ్ కంట్రోల్ సెంటర్ నెలకొల్పారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. ప్రత్యేకంగా స్ట్రైకింగ్ ఫోర్స్, ఫ్లైయింగ్ స్క్వాడ్‌లు ఏర్పాటు చేశారు. భధ్రత కోసం డ్రోన్లను వినియోగిస్తున్నారు. సోషల్ మీడియాపైనా నిఘా వేశారు. సరిహద్దు గ్రామాల్లో మద్యం పంపిణీపై నిఘా వేశారు.












Click it and Unblock the Notifications