పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు విద్యార్ధులు స్పాట్ డెడ్ !
పల్నాడు జిల్లాలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదం ఐదుగురు కుటుంబాల్లో తీవ్ర విషాదం నింపింది. నాదెండ్ల మండలం గణపవరం సమీపంలోని బైపాస్ రోడ్డుపై వేగంగా వెళ్తున్న కారు.. ముందుగా ప్రయాణిస్తున్న లారీని వెనుక నుంచి బలంగా ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా ధ్వంసమవ్వగా.. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు విద్యార్థులు ఘటన స్థలంలోనే మృతి చెందారు.
అలానే మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా వారిని స్థానికులు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు వెల్లడించారు. కాగా ప్రమాదంలో మృతి చెందిన విద్యార్థులు అందరూ అయ్యప్పమాల ధారణలో ఉన్నారు. వారంతా విజ్ఞాన్ కాలేజీకి చెందినవారని పోలీసులు గుర్తించారు. అయ్యప్ప దీక్షలో భాగంగా సమీప దేవాలయాల్లో దర్శనం చేసుకుని తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ దుర్ఘటనతో విద్యార్థుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.

ఈ ఘోర ప్రమాదంపై ఏపీ మంత్రులు గొట్టిపాటి రవికుమార్, మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఎంతో గొప్పస్థాయికి ఎదగాలని ఆశించే చిన్న వయసులోని ఇలా ప్రాణాలు కోల్పోవడం హృదయ విదారకమని అన్నారు. వారి కుటుంబాలకు ధైర్యం చెప్పుతూ ప్రభుత్వం తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ప్రమాదంలో గాయపడిన విద్యార్థులకు అత్యుత్తమ వైద్యం అందించాలని ఆరోగ్య శాఖ అధికారులను మంత్రులు ఆదేశించారు. అవసరమైతే వారిని మెరుగైన వైద్య సేవల కోసం పెద్ద ఆసుపత్రులకు తరలించడానికి ఏర్పాట్లు చేయాలని సూచించారు. అయితే అధిక వేగం, అజాగ్రత్త కారణం గానే ప్రమాదం జరిగి ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రత్యేకంగా విద్యార్థులు, యువత ప్రయాణించే సమయంలో వేగం పై నియంత్రణ పాటించాలని, కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా ప్రయాణించాలని పోలీసులు సూచించారు. ఇప్పటికే పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల వరుసగా బస్సు ప్రమాద ఘటనల్లో ప్రజలు మృతి చెందిన విషయం తీవ్రంగా కలిచివేస్తుంది.












Click it and Unblock the Notifications