టీడీపీలోకి కడప జిల్లా మాజీ మంత్రి..!?
ఏపీలో ప్రధాన పార్టీల ఎన్నికల వ్యూహాలు మొదలయ్యాయి. పార్టీల్లో చేరికలకు డోర్స్ ఓపెన్ అవుతున్నాయి. ప్రతిపక్ష టీడీపీ ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో మాజీ నేతలను దగ్గర చేసుకుంటోంది. జిల్లాలో సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తోంది. అందులో భాగంగానే కడప జిల్లాలో మాజీ ఎమ్మెల్యేలతో టీడీపీ ముఖ్య నేతలు సంప్రదింపులు జరుపుతున్నారు. తాజాగా.. తనతో పాటుగా డీఎల్ రవీంద్రారెడ్డి త్వరలో టీడీపీలో చేరుతున్నామంటూ మాజీ ఎమ్మెల్యే వీర శివారెడ్డి వెల్లడించారు. అదే సమయంలో కడప జిల్లాకు చెందిన మాజీ మంత్రి టీడీపీలో చేరేందుకు సిద్దమవుతున్నట్లు సమాచారం.

టీడీపీలోకి ఆదినారాయణ రెడ్డి రీ ఎంట్రీ..?
మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తిరిగి టీడీపీలోకి రావటానికి రంగం సిద్దం అవుతోంది. జిల్లాకు చెందిన నేత ఎవరెవరు టీడీపీలో చేరనున్నరో చెప్పుకొచ్చారు. ఈ సారి సీనియర్లు..గెలిచే అభ్యర్ధులకే చంద్రబాబు సీట్లు ఇవ్వబోతున్నారని విశ్లేషించారు. జమ్మలమడుగు నుంచి ఆదినారాయణ రెడ్డి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2014లో గెలిచిన తరువాత టీడీపీలోకి ఫిరాయించి మంత్రి అయ్యారు. జగన్ లక్ష్యంగా ఆ సమయంలో తీవ్ర స్థాయిలో విమర్శలు చేసారు. నియోజకవర్గంలో తొలి నుంచి వ్యతిరేకంగా ఉన్న రామసుబ్బారెడ్డి - ఆదినారాయణ రెడ్డి కి సీట్ల కేటాయింపులో భాగంగా 2019 ఎన్నికల్లో ఆదినారాయణ రెడ్డి కడప ఎంపీగా పోటీ చేసారు. వైసీపీ అభ్యర్ధి అవినాశ్ రెడ్డి చేతిలో పరాజయం పాలయ్యారు.

అధికారంలోకి జగన్..బీజేపీలోకి ఆదినారాయణ రెడ్డి
2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత ఆదినారాయణ రెడ్డి బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర నేతలకు దగ్గరయ్యారు. అదే సమయంలో మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరారు. దీంతో, టీడీపీ నియోజకవర్గ బాధ్యతలు ఆదినారాయణ అన్న కుమారుడు భూపేష్‌రెడ్డి ప్రస్తుతం జమ్మలమడుగు టీడీపీ ఇన్‌చార్జ్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో భూపేష్ రెడ్డి టీడీపీ నుంచి బరిలో ఉంటారని ప్రచారం సాగింది. ఇదే సమయంలో వైసీపీ నుంచి తిరిగి వచ్చే ఎన్నికల్లోనూ సుధీర్ రెడ్డి పోటీలో ఉంటారని ఈ మధ్య కాలంలోనే పార్టీ ముఖ్య నాయకత్వం స్పష్టత ఇచ్చింది. ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి తిరిగి టీడీపీలో చేరిక ఖాయమైతే ఆయన వచ్చే ఎన్నికల్లో తిరిగి టీడీపీ అభ్యర్ధిగా బరిలో నిలుస్తారా..లేక అన్న కుమారుడికే మద్దతుగా నిలుస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది.
