kanna lakshminarayana : టీడీపీలో కన్నా చేరిక-చంద్రబాబు సమక్షంలో-కీలక వ్యాఖ్యలు..
ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇవాళ చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు. భారీగా తరలివచ్చిన అనుచరులతో కలిసి కన్నా టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు.

టీడీపీలో చేరిన కన్నా లక్ష్మీనారాయణ
సీనియర్ నేత, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఇవాళ టీడీపీలో చేరారు. మంగళగిరిలోని టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయానికి భారీగా అనుచరులతో తరలివచ్చిన కన్నా.. ఆ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు బీజేపీ నుంచి భారీగా అనుచరులు, నేతలు టీడీపీలో చేరారు. బీజేపీలో అంతర్గత విభేదాల నేపథ్యంలో పార్టీకి గుడ్ చై చెప్పిన కన్నా.. వచ్చే ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని టీడీపీ తీర్దం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు.

కన్నా చేరికపై చంద్రబాబు
టీడీపీలోకి కన్నా లక్ష్మీనారాయణ రాక శుభపరిణామని చంద్రబాబు తెలిపారు. ఆయన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. కన్నాను పలు హోదాల్లో తాను చూశానని, ఎన్ఎస్ఈయూలో నాయకుడిగా చేరి అంచెలంచెలుగా ఎదిగారని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర రాజకీయాల్లో కన్నాకు ఓ ప్రత్యేకస్ధానం ఉందని, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన చరిత్ర ఆయనదన్నారు. 2004-2014 వరకూ ముగ్గురు ముఖ్యమంత్రుల దగ్గర కన్నా కేబినెట్ మంత్రిగా పనిచేశారని గుర్తుచేశారు. సిద్ధాంత పరంగా పనిచేసిన నాయకుడు కన్నా అని ప్రశంసించారు.
రాజకీయాల్లో హుందాగా, నిబద్ధతతో పనిచేసిన నాయకుడన్నారు. రాజకీయాల్లో తానూ కన్నాతో విభేదించానని, కానీ వ్యక్తిగతంగా కాదన్నారు.

టీడీపీలోకి అందుకే చేరానన్న కన్నా..
తాను చంద్రబాబుతో మొదటి నుంచి పోరాటం చేసిన వ్యక్తి అని కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. చాలా మందికి టీడీపీలో తానెందుకుచేరుతున్నాననే అనుమానాలు కూడా రావొచ్చన్నారు. చంద్రబాబు చెప్పినట్లు రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతోందని, రాక్షస క్రీడను ఈ రాష్ట్రం నుంచి పారద్రోలాలంటే ప్రజాస్వామ్యవాదులంతా కలిసిరావాల్సిన అవసరముందని తెలిపారు.
ఒక్క ఛాన్స్ ఇవ్వండి, తండ్రిని మరిపిస్తానని చెప్పి అధికారంలోకి వచ్చి, రాష్ట్ర సంపదంతా కేంద్రీకృతంగా చేసుకుని వ్యాపారం చేసుకుంటున్నాడని జగన్ పై కన్నా విమర్శలు గుప్పించారు.రాష్ట్రంలో పేద బడుగు వర్గాల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదన్నారు. సంక్షేమం అంటే చాక్లెట్ ఇచ్చేది కాదన్నారు. ప్రజలకు చాక్లెట్లు పంచే పేరుతో వేల కోట్ల అప్పులు తెస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చాక అమరావతినే రాజధానిగా కొనసాగిస్తానని అధికారంలోకి వచ్చాక మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. అభివృద్ధి చెందిన విశాఖ దోచుకోవడానికి రెడీగా ఉంటుందనే రాజధాని చేస్తున్నారన్నారు.ఏపీ అభివృద్ధి, భవిష్యత్, రాజధాని అమరావతిని దృష్టిలో పెట్టుకుని టీడీపీలో చేరుతున్నట్లు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు.












Click it and Unblock the Notifications