చంద్రబాబు, పవన్ పై సుబ్రమణ్యస్వామి ఫైర్-హిందూ సెంటిమెంట్లు గాయపరుస్తున్నారంటూ..
ఏపీలో వైసీపీ వర్సెస్ విపక్షాలుగా సాగుతున్న రాజకీయంలో తాజాగా టీటీడీ శ్రీవాణి ట్రస్టు వ్యవహారం కీలకంగా మారింది. శ్రీవాణి ట్రస్టు నిధుల్ని లెక్కలు లేకుండా సేకరిస్తున్నారంటూ విపక్ష నేతలు చంద్రబాబు, పవన్ ఈ మధ్య తరచుగా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. వీటిపై ప్రభుత్వంతో పాటు టీటీడీ కూడా కౌంటర్లు ఇచ్చింది. అయినా విమర్శల జడి మాత్రం ఆగడం లేదు. ఈ నేపధ్యంలో ఇవాళ ప్రభుత్వానికి మద్దతుగా ఉంటున్న బీజేపీ మాజీ ఎంపీ సుబ్రమణ్యస్వామి రంగంలోకి దిగారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ టీడీపీపై దుష్ప్రచారం చేస్తున్నారని, హిందువుల సెంటిమెంట్లు గాయపరుస్తున్నారని బీజేపీ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి ఇవాళ ఆరోపించారు. ప్రజాక్షేత్రంలో పోరాడలేక అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో వైవీ సుబ్బారెడ్డి క్రిస్టియన్ అన్నారని, అది అవాస్తవం అని తేలిందని, ఇప్పుడు శ్రీవాణి ట్రస్టుపై ఆరోపణలు చేస్తున్నారని స్వామి మండిపడ్డారు. అలాగే ఏపీలో ఎలాంటి మత మార్పిళ్లు లేవని ఆయన స్పష్టం చేశారు. అటు తిరుమలలో అన్యమత ప్రచారం కూడా జరగడం లేదన్నారు.

ప్రజాక్షేత్రంలో పోరాడలేకే చంద్రబాబు, పవన్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని స్వామి మండిపడ్డారు. కాగ్ ద్వారా స్వచ్ఛందంగా ఆడిట్ చేయించేందుకు టీటీడీ ముందుకొచ్చిందని, కాబట్టి మతపరమైన అంశాల్లో జోక్యం చేసుకోకుండా చంద్రబాబు రాజకీయాలకే పరిమితం కావాలని స్వామి హితవు పలికారు. టీడీడీకి అన్ని విధాలుగా అండగా ఉండేందుకు సిద్ధంగా ఉన్నట్లు స్వామి తెలిపారు. త్వరలో శ్రీవాణి ట్రస్టు ద్వారా టికెట్ కొని స్వామివారి దర్శనం చేసుకుంటానన్నారు.
అలాగే సొంతమామకు గౌరవం ఇవ్వని చంద్రబాబు.. హిందువులకు ఎలా గౌరవం ఇస్తారని కూడా సుబ్రమణ్యస్వామి ప్రశ్నించారు. హిందూ దేవాలయాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని చంద్రబాబును స్వామి హెచ్చరించారు. అలాగే వైఎస్ జగన్ ఎప్పుడూ హిందూ వ్యతిరేక చర్యలకు పాల్పడలేదని స్వామి కితాబిచ్చారు. టీటీడీని అప్రతిష్టపాలు చేసేందుకు చంద్రబాబు, పవన్ ప్రయత్నిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో జగన్ ను ఢీకొట్టడం వీరికి అంత సులువు కాదన్నారు.












Click it and Unblock the Notifications