పవన్‌పై హైఓల్టేజ్ ఫైట్
Godavari floods 2024: ఇటీవలే కురిసిన భారీ వర్షాలు, దానివల్ల సంభవించిన వరదల వల్ల రెండు తెలుగు రాష్ట్రాలను అల్లకల్లోలానికి గురయ్యాయి. దారుణంగా దెబ్బతిన్నాయి. పలు ప్రాంతాలు నీట మునిగాయి. పల్లెలు, పట్టణాలు అనే తేడా ఉండట్లేదు. నదులు, చెరువులు ఏకం అయ్యాయి. జనావాసాలన్నీ జలమయం అయ్యాయి.
ప్రత్యేకించి- రాజధాని అమరావతి ప్రాంతం మొత్తం నీట మునిగింది. విజయవాడలో ఇదే పరిస్థితి నెలకొంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో వరద ఉధృతి నెలకొంది. వేలాదిమందిని ముంపు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రదేశాలకు తరలించారు అధికారులు.

అదే తరహా పరిస్థితులు అటు కాకినాడ జిల్లాలోనూ ఏర్పడ్డాయి. జిల్లాలోని ఏలేరు ఉప్పొంగింది. వరద తాకిడికి గురైంది. దీని ప్రభావంతో పిఠాపురం నియోజకవర్గంలోని అనేక గ్రామాలు నీట మునిగాయి. వేలాది హెక్టార్లల్లో చేతికి అందిన పంట నీటిపాలయింది. ఏలేరు రిజర్వాయర్ ఇన్‌ఫ్లో కూడా ఏ మాత్రం తగ్గట్లేదు.
ఏలేరు ఉధృతి వల్ల జిల్లా వ్యాప్తంగా 75,000 ఎకరాల మేర వరి, ఇతర పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయ మంత్రిత్వ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. దీనివల్ల 41,000 మంది రైతులకు నష్టపోయినట్లు గుర్తించారు. పంట నష్టం భారీగా ఉండొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.
ఈ పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు పిఠాపురంలో పర్యటించనున్నారు. ఏలేరు వరద ఉద్ధృతికి గురైన గ్రామాలకు వెళ్లనున్నారు. ఈ ఉదయం 9:15 నిమిషాలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరుతారు. 10:30 గంటలకు పిఠాపురానికి చేరుకుంటారు.
అక్కడినుంచి బయలుదేరి పాత ఇసుకపల్లి మీదుగా మాధవపురం చేరుకుంటారు. అక్కడ వరద బాధితులతో మాట్లాడతారు. వారికి భరోసా ఇస్తారు. అనంతరం యూ కొత్తపల్లి మండలం పరిధిలోని నాగులపల్లి, రమణక్కపేటకు వెళ్తారు. అక్కడ బాధితులతో మాట్లాడిన అనంతరం తిరిగి పిఠాపురానికి వస్తారు. మధ్యాహ్నం అక్కడి నుంచి తాడేపల్లి చేరుకుంటారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న నియోజకవర్గం ఇది. మొన్నటి ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ఆయన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఏలేరు వరద సంభవించిన నేపథ్యంలో ఇటీవలే ఆయన పిఠాపురంలో పర్యటించారు. ఎన్నికల తరువాత తొలిసారిగా అక్కడికి వెళ్లనున్నారు జగన్.












Click it and Unblock the Notifications