రామోజీ చనిపోయినా మార్గదర్శిని వదలని ఉండవల్లి..! మళ్లీ మొదలు..
ఏపీలో గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాల హయాంలో మార్గదర్శి చిట్స్ ను టార్గెట్ చేసిన మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తాజాగా ఆ గ్రూపు ఛైర్మన్ రామోజీరావు మృతితో ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తానని చెప్పుకొచ్చారు. ఆయనే చనిపోయాక ఇక మార్గదర్శిపై పోరాటం చేసి అర్ధం లేదని వ్యాఖ్యానించారు. కానీ ఇవాళ మాత్రం యూటర్న్ తీసుకుని తెలంగాణ హైకోర్టులో మార్గదర్శి చిట్స్ కేసుపై తన అభ్యంతరాలను వెల్లడించారు.
తెలంగాణ హైకోర్టులో జస్టిస్ సుజయ్ పాల్, జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు బెంచ్ ముందు మార్గదర్శి పిటిషన్లపై విచారణ జరిగింది. ఈ సందర్భంగా పిటిషనర్ అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ తో పాటు మార్గదర్శి లాయర్ సిద్ధార్ద్ లూత్రా ఆన్ లైన్ ద్వారా విచారణ కు హాజరయ్యారు. ఆర్బీఐ కౌంటర్ పై స్పందన కోసం రెండు వారాలు సమయం కావాలని లూత్రా కోరగా.. ఉండవల్లి అరుణ్ కుమార్ మాత్రం తన అభిప్రాయాన్ని కోర్టుకు వెల్లడించారు.

ఆర్బీఐ నిబంధనల ప్రకారం మార్గదర్శి చందాలు సేకరించడం చట్ట విరుద్దమని రిజర్వ్ బ్యాంక్ తన కౌంటర్ లో చెప్పిన విషయాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టు దృష్టికి తెచ్చారు. గతంలో మార్గదర్శి తమ 70 వేల చందాదారుల వివరాలు సుప్రీంకోర్టుకు ఇచ్చిందని, ఆ వివరాలు హైకోర్టుకు కూడా ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనిపై ఓ అఫిడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు ఆయనకు సూచించింది. దీనిపై రెండు వారాల్లో కౌంటర్లు వేయాలని ఏపీ,తెలంగాణ ప్రభుత్వాలను కూడా హైకోర్టు ఆదేశించింది.












Click it and Unblock the Notifications