"కూటమికీ, వైసీపీకీ ఓటేయొద్దు"- ఏపీ ఓటర్లకు మాజీ ఐఏఎస్ షాకింగ్ పిలుపు..!
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు గతంలో ఎప్పుడూ లేనంత స్ధాయిలో తీవ్ర చర్చనీయాంశంగా మారుతున్నాయి. దీనికి కారణం హింస, బెదిరింపులు, కేసులు, పోలీసుల అకృత్యాలు ఇలా ఎన్నో ఉన్నాయి. గతంలో వైఎస్సార్సీపీ హయాంలో ఇవన్నీ జరిగాయి కాబట్టి తామూ చేస్తున్నాం అని కూటమి ప్రభుత్వం వీటిని సమర్దించుకుంటున్న తీరు ప్రజాస్వామ్య వాదులకు నచ్చడం లేదు. దీంతో స్దానిక ఎన్నికల్లో అధికార కూటమి అభ్యర్దుల్నీ, వైఎస్సార్సీపీ అభ్యర్దుల్నీ ఓడించాలనే పిలుపులు పలు చోట్ల వినిపిస్తున్నాయి.
ఇదే క్రమంలో గతంలో టీడీపీ, వైఎస్సార్సీపీ ప్రభుత్వాల్లో పలు హోదాల్లో పని చేసిన రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి (Former IAS ) డాక్టర్ పీవీ రమేశ్ (PV ramesh) స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లకు కీలక పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హృదయ పూర్వక విజ్ఞప్తి అంటూ ఆయన ఇవాళ ఓ ట్వీట్ చేశారు. ఇందులో ఆయన.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గూండాలు, రౌడీలు, సంఘ విద్రోహ శక్తులకు స్వర్గధామంగా దిగజారడాన్ని చూడటం హృదయ విదారకంగా ఉందన్నారు. భారతదేశంలోని అత్యంత ప్రగతిశీల రాష్ట్రాలలో ఒకటిగా వెలుగొందిన ఈ రాష్ట్రంలో, రెండు కుటుంబ యాజమాన్యంలోని పార్టీలు కలిసికట్టుగా మధ్యయుగాల నాటి భూస్వామ్య వ్యవస్థను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తూ, రాష్ట్రాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

కులతత్వం, బంధుప్రీతి, అవినీతి, విషపూరిత రాజకీయీకరణ మొదలైన వాటితో కీలక పరిపాలనా సంస్థలు కలుషితమయ్యాయని పీవీ రమేశ్ తెలిపారు. రాజకీయాలు కాంట్రాక్టర్లు, మైనింగ్ డాన్‌లు, విద్యా, ఆరోగ్య శాఖాధిపతులు, మద్యం కాంట్రాక్టర్లు, పైరవీకారులు, గూండాల ప్రత్యేక ఆధిపత్యంగా మారిపోయాయన్నారు. పోలీసులు అధికార పార్టీకి ప్రైవేట్ సైన్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. రాజకీయ పార్టీలు ఒకరినొకరు నాశనం చేయాల్సిన శత్రువులుగా చూసుకున్నప్పుడు, ఎన్నికలు ఆయుధాలు, డబ్బుతో పోరాడాల్సిన యుద్ధంగా మారినప్పుడు, దానిని ప్రజాస్వామ్యంగా వర్గీకరించలేమన్నారు. ఇది రాక్షస పాలన అన్నారు. రాష్ట్రంలో స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికలు జరుగుతాయని ఆశించడం పగటి భ్రమ మాత్రమే అన్నారు.

AI, క్వాంటం, ప్రపంచ స్థాయి నగరం వంటి ప్రకటనలు చేసినప్పటికీ, ఆంధ్రప్రదేశ్ అనేక విధాలుగా అత్యంత పతనావస్థలో మిగతా భారతదేశానికి ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాస్తవాన్ని గ్రహించి, వైసీపీకి కానీ, ఎన్డీయే కూటమిలో పార్టీల అభ్యర్ధులకు కానీ ఓటు వేయకుండా ఈ నేరపూరిత కుట్రకు ముగింపు పలకాలని విజ్ఞప్తి చేశారు. ప్రజాహిత భావాలున్న ఇతర అభ్యర్థులు ఎవరైనా ఉంటే వారికి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఓటును అమ్ముకోవద్దని, అది అమూల్యమైనదని తెలిపారు.














Click it and Unblock the Notifications
