తెరపై మరో రమేష్ కుమార్: రిటైర్డ్ ఐఎఎస్ అధికారికి ఏపీలో కీలక పదవి: పశ్చిమ బెంగాల్ నుంచి
అమరావతి: రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో బాగా వినిపిస్తోన్న పేరు నిమ్మగడ్డ రమేష్ కుమార్. రాజకీయ పరమైన వివాదాలన్నీ ఆయన చుట్టూ తిరుగుతున్నాయి. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను అర్ధాంతరంగా వాయిదా వేయడంతో మొదలైన నిమ్మగడ్డ రమేష్ కుమార్ పేరు.. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని పార్క్ హయత్‌లో భారతీయ జనతా పార్టీ నాయకులతో భేటీ కావడం వరకూ అన్నీ కాంట్రవర్సీలను క్రియేట్ చేసినవే.
ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో తాజాగా మరో రమేష్ కుమార్ పేరు వినిపిస్తోంది. పూర్తిపేరు పెయ్యాల రమేష్ కుమార్. నిమ్మగడ్డ రమేష్ కుమార్ తరహాలోనే ఆయనా రిటైర్డ్ ఐఎఎస్ అధికారి. కడప జిల్లాకు చెందిన పెయ్యాల రమేష్‌కుమార్‌ను రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ (ఏపీసీఐసీ)గా నియమించే అవకాశాలు ఉన్నాయి. ఆయన నియామకం దాదాపు ఖరారైందని అంటున్నారు. ఆయనను ప్రధాన సమాచార కమిషనర్‌గా నియమిస్తూ త్వరలోనే ఉత్తర్వులు వెలువడే అవకాశాల ఉన్నాయి.

1986 బ్యాచ్ పశ్చిమ బెంగాల్ క్యాడర్‌కు చెందిన ఐఎఎస్ అధికారి ఆయన. 2017లో పదవీ విమరణ చేశారు. ఆయన సేవలను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం వినియోగించుకుంటోంది. ప్రస్తుతం ఆయన పశ్చిమ బెంగాల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ సభ్యుడిగా కొనసాగుతున్నారు. రాష్ట్రంలో రెండేళ్లుగా ఖాళీగా ఉంటోన్న సమాచార ప్రధాన కమిషనర్‌గా ఆయనను నియమించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు.
పెయ్యాల రమేష్ కుమార్ తండ్రి అబ్బయ్య కూడా ఐఎఎస్ అధికారిగా పనిచేశారు. రమేష్ కుమార్ కుటుంబానికి పాలనలో సుదీర్ఘ అనుభవం ఉందని, దాన్ని రాష్ట్ర ప్రయోజనాల కోసం వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం. ఆయన కేరీర్‌లో ఎలాంటి వివాదాలు గానీ, అవినీతి ఆరోపణలు లేకపోవడం వల్ల పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఆయన సేవలను వినియోగించుకుంటోందని వైఎస్ జగన్ భావిస్తున్నారని అంటున్నారు.












Click it and Unblock the Notifications