బాలినేనికి జగన్ బుజ్జగింపులు..! అన్నీ చూసుకుంటానని హామీ..
ఏపీలో వైసీపీ మాజీ మంత్రి, ఒంగోలు అసంతృప్త ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఇవాళ సీఎం జగన్ తో భేటీ అయ్యారు. ప్రకాశం జిల్లా వైసీపీలో నెలకొన్న అంతర్గత పోరు, దీని కారణంగా పార్టీ సమన్వయకర్త బాధ్యతల్ని వదులుకున్న తీరుపై ఆయనతో చర్చించారు. ముఖ్యంగా టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డితో నెలకొన్న విభేదాలపై ఆయన సీఎం జగన్ తో చర్చించారు. ఈ సందర్భంగా జగన్ బాలినేనికి కీలక హామీలు ఇచ్చినట్లు తెలుస్తోంది.
సీఎం జగన్ తో భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన బాలినేని శ్రీనివాసరెడ్డి ఉల్లాసంగానే కనిపించారు. జగన్ తో అన్ని విషయాలు చర్చించినట్లు ఆయన తెలిపారు. ప్రకాశం జిల్లా వైసీపీ రాజకీయాలు, తనకు ఎదురవుతున్న అనుభవాలపై చర్చించినట్లు తెలిపారు. గతంలో సీఎం టూర్ సందర్భంగా ఎదురైన ప్రోటోకాల్ సమస్యపైనా స్పందించారు. మంత్రిగా లేకుండా ప్రోటోకాల్ ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ప్రోటోకాల్ పెద్ద విషయం కాదని, దానిపై ఫిర్యాదు చేయడానికి ఏముంటుందన్నారు.

గతంలో రీజనల్ కో ఆర్డినేటర్ పదవి వదులుకున్న బాలినేని శ్రీనివాసరెడ్డి దానిపై ఇప్పుడు జగన్ తో మరోసారి చర్చించలేదని క్లారిటీ ఇచ్చారు. గతంలోనే దీన్ని వదులుకున్నట్లు గుర్తుచేశారు. కావాలని పార్టీలో కొందరు తనపై దుష్ప్రచారం చేసినట్లు ఆయన చెప్పుకొచ్చారు. జిల్లాలో ఇద్దరితోనే తనకు ఇబ్బంది ఉన్నట్లు తెలిపారు. కానీ పార్టీపై అలగలేదన్నారు. పార్టీలో కొందరు ఇబ్బందులు పెట్టినా తాను మాత్రం సర్దుకుపోతున్నట్లు వెల్లడించారు.
సీఎం జగన్ ను తాను ఎప్పుడూ కలుస్తూనే ఉన్నట్లు బాలినేని తెలిపారు. ఈసారి భేటీ సందర్భంగా కూడా నియోజకవర్గంపై దృష్టిపెట్టాలని జగన్ తనకు సూచించినట్లు బాలినేని వెల్లడించారు. ఒంగోలు నియోజకవర్గంలో రూ.200 కోట్లతో ఇళ్ల స్ధలాల పంపిణీ కోసం ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications