జనసేనలో తెగిన మరో టికెట్
TDP Janasena BJP alliance: వచ్చే ఎన్నికల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనడానికి తెలుగుదేశం పార్టీ.. జనసేన, భారతీయ జనతా పార్టీతో కట్టిన కూటమి ప్రభావం సీనియర్లకు టికెట్లు లేకుండా చేస్తోంది. సుదీర్ఘకాలంగా పార్టీకి విధేయులుగా, నిత్యం ప్రజల మధ్య ఉంటూ వచ్చిన నాయకులు పొత్తుల వల్ల సీట్లు, టికెట్లను కోల్పోవాల్సి వస్తోంది.
టీడీపీ, జనసేనకు చెందిన పలువురు సీనియర్ నాయకులు, ఆశావహులు, మాజీ ఎమ్మెల్యేలు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తోన్నారు. పలువురు సీనియర్లు గుడ్‌బై చెబుతున్నారు. వారంతా పార్టీకి రాజీనామాలు చేస్తోన్నారు. ప్రత్యామ్నాయంగా వైఎస్ఆర్సీపీలో చేరుతున్నారు.

ఈ పరంపర మరింత ఉధృతమైంది. అన్నమయ్య రాయచోటి జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు రెడ్డెప్పగారి రమేష్ రెడ్డి, జనసేన సీనియర్ నేత పోతిన మహేష్, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి, కేఈ ప్రభాకర్ వైఎస్ఆర్సీపీలో చేరడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు కూడా.
తాజాగా మరో మాజీ శాసన సభ్యురాలు, జనసేనకు చెందిన సీనియర్ నాయకురాలు పాముల రాజేశ్వరి.. వైఎస్ఆర్సీపీలో చేరనున్నారు. 2004, 2009 ఎన్నికల్లో ఆమె డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పీ గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తరువాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌ను వీడారు.
తొలుత తెలుగుదేశం, అనంతరం జనసేన పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో పీ గన్నవరం నియోజకవర్గం నుంచే జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు గానీ ఓడిపోయారు. మూడోస్థానానికి పరిమితం అయ్యారు. ఆ తరువాత కూడా జనసేనలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఈ ఎన్నికల్లోనూ పీ గన్నవరం టికెట్‌ను ఆశించారు.
ఆమెకు టికెట్ ఇవ్వలేదు పవన్ కల్యాణ్. పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గాన్ని దక్కించుకున్నప్పటికీ.. పాముల రాజేశ్వరికి మొండిచెయ్యి చూపారు. ఆమెకు బదులుగా గిడ్డి సత్యనారాయణకు టికెట్ ఇచ్చారు. దీనితో పాముల రాజేశ్వరి జనసేనను వీడారు. వైసీపీలో చేరనున్నారు.












Click it and Unblock the Notifications