చంద్రబాబు పెద్ద తప్పుచేశారు..! ఉండవల్లి షాకింగ్ కామెంట్స్..!
ఏపీలో ఏ ప్రభుత్వం, పార్టీ అధికారంలో ఉన్నా నిర్మోహమాటంగా తన అభిప్రాయాల్ని చెప్తారన్న పేరున్న మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఇవాళ కూటమి సర్కార్ పై ఓ విషయంలో మండిపడ్డారు. సీఎం చంద్రబాబు పెద్ద తప్పు చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో తాజాగా చోటు చేసుకున్న ఓ సీనియర్ బ్యూరోక్రాట్ అరెస్టుకు సంబంధించి ఉండవల్లి ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు సదరు అధికారికి ఆయన క్లీన్ చిట్ ఇచ్చారు.
ముంబై నటి కాబందరీ జెత్వానిపై వేధింపుల కేసులో డీజీపీ స్థాయి అధికారి పీఎస్సార్ ఆంజనేయుల్ని చంద్రబాబు ప్రభుత్వం అరెస్టు చేయడాన్ని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు అరెస్టు చాలా పెద్ద తప్పు అన్నారు. రెండు రోజుల క్రితం విజయవాడ జైలుకు వెళ్లి పీఎస్ఆర్ ను కలిసి వచ్చానని ఆయన తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం పీఎస్ఆర్ పై కక్ష సాధిస్తోందని ఉండవల్లి ఆరోపించారు.

ముంబై నటి తనను రేప్ చేశారని ఫిర్యాదు ఇచ్చిందని, ముంబైలో ఆ కేసు పరిష్కారం కాకుండా ఏపీలో విచారణ ఎలా ప్రారంభిస్తారని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఉండవల్లి అరుణ్ కుమార్ సూటిగా ప్రశ్నించారు. పీఎస్ఆర్ అరెస్ట్ పోలీస్ శాఖపై చాలా ప్రభావం చూపుతుందన్నారు. తాను మరి కొంతకాలం జైల్లో ఉండడానికి సిద్ధంగా ఉన్నానని పీఎస్ఆర్ తనతో చెప్పినట్లు ఉండవల్లి వెల్లడించారు.

మరోవైపు ఐపీఎస్ అధికారి పీఎస్సార్ ఆంజనేయులుతో తనకు మంచి స్నేహం ఉందని ఉండవల్లి తెలిపారు. చంద్రబాబు హయాంలో ఆయన ఐదు జిల్లాలకు ఎస్పీగా పనిచేశారని, ఆయన ఎక్కడికి వెళ్లే అక్కడ రౌడీయిజాన్ని, ఫ్యాక్షనిజాన్ని ఉక్కుపాదంతో అణచివేసి టెర్రర్ క్రియేట్ చేశారన్నారు. మాజీ సీఎం వైఎస్ హయాంలోనూ కీలక పోస్టుల్లో పనిచేశారని గుర్తుచేశారు. ఆయన వాట్ మిస్టర్ అంజన్ అని సంబోధించేవారన్నారు. జత్వానీ కేసులో ముందస్తు బెయిల్ తీసుకోమన్నా పీఎస్సార్ ఇష్టపడలేదని, జైలుకెళ్లేందుకు ఆయన ముందుగానే ప్రిపేర్ అయ్యారన్నారు.












Click it and Unblock the Notifications