పులిచింతలపై చర్చకు రెడీ- వైసీపీ సర్కార్ కు టీడీపీ నేత కాల్వ సవాల్
కృష్ణా నదీ వరద ప్రవాహానికి ఏపీలోని గుంటూరు జిల్లాల్లో ఉన్న పులిచింతల ప్రాజెక్టు గేటు ఊడిన ఘటన రాష్ట్రంలో రాజకీయ పక్షాల మధ్య మాటల యుద్ధానికి కారణమవుతోంది. నాణ్యత లేకుండా పులిచింతల ప్రాజెక్టు కట్టిన పాపం మీదంటే మీదంటూ ప్రధాన రాజకీయ పక్షాలైన వైసీపీ, టీడీపీ పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి.
పులివెందుల ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయిన నేపథ్యంలో వైసీపీ సర్కార్ పై టీడీపీ మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు విమర్శలు గుప్పించారు. పులిచింతల ప్రాజెక్ట్ నిర్మాణనంపై బహిరంగ చర్చకు సిద్ధమని కాల్వ శ్రీనివాసులు వైసీపీ సర్కార్ కు సవాల్ విసిరారు. జలయజ్ఞం పేరుతో మాజీ సీఎం వైఎస్ ధనయజ్ఞం చేశారని కాల్వ ఆరోపించారు. తాము అప్పట్లో ఇదే విషయాన్ని చెప్పినా ఆయన పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు పులిచింతల గేటు ఊడిపోవడంతో అప్పటి నిర్మాణ లోపాలు బయటపడ్డాయన్నారు.

వైఎస్సార్ సీఎం అయ్యాకే పులిచింతల ప్రాజెక్ట్ పనులు ప్రారంభమైనట్లు కాల్వ శ్రీనివాసులు గుర్తుచేశారు. పులిచింతల ప్రాజెక్ట్ పనులపై గతంలో ఎన్ని ఆరోపణలు వచ్చినా వైఎస్ పట్టించుకోలేదని కాల్వ ఆరోపించారు. ఈపీసీ విధానం అమలుతో నాడు వైఎస్... నాయకులు, కాంట్రాక్టర్ల దోపిడీకి స్వేచ్ఛనిచ్చారని కాల్వ శ్రీనివాసులు విమర్శించారు. దీంతో పనుల్లో నాణ్యత లేకుండా పోయిందన్నారు. ఇప్పుడు వైసీపీ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబే పులిచింతల నాణ్యతా లోపాలకు కారణమని చెప్పడం విడ్డూరంగా ఉందని కాల్వ శ్రీనివాసులు అన్నారు.












Click it and Unblock the Notifications