చంద్రబాబుకు ఐటీ నోటీసులపై సుజనా రియాక్షన్ ఇదే-పురందేశ్వరి మద్దతుపైనా.. !
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి. ముఖ్యంగా ఎన్నికల ఏడాది టీడీపీ అధినేత చంద్రబాబుకు జారీ అయిన ఐటీ నోటీసులపై వైసీపీ విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో ఆయనకు మద్దతుగా ఉన్నారని భావిస్తున్న పురందేశ్వరి నోరు విప్పకపోవడం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. దీనిపై ఇవాళ బీజేపీ మాజీ ఎంపీ సుజనా చౌదరి స్పందించారు. అలాగే వచ్చే ఎన్నికల్లో తన పోటీపైనా సుజనా కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎన్టీఆర్ జిల్లా వీరులపాడు మండలం పొన్నవరం లో మాజీ కేంద్ర మంత్రి సుజానా చౌదరి ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబుకు జారీ అయిన ఐటీ నోటీసులపై ఆయన్ను మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. నోటీసులు ఇచ్చింది తనకు కాదు కదా చంద్రబాబునే అడగండి అన్నారు. తద్వారా ఈ వ్యవహారంతో దూరంగా ఉండేందుకు సుజనా ప్రయత్నించారు.

మరోవైపు వచ్చే ఎన్నికల్లో పోటీపైనా సుజనా చౌదరి స్పందించారు. ఎన్నికల్లో పోటీ చేసే సమయంలో అందరికీ చెప్పి పోటీ చేస్తానని సుజనా చౌదరి వెల్లడించారు. చంద్రబాబుకు ఐటీ నోటీసులపై మరోసారి ప్రశ్నిస్తే.. తాను కేంద్ర మంత్రి గా ఉన్నప్పుడు నోటీసు రాలేదు కదా అని మాట దాట వేశారు. అలాగే రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో పొత్తులపైనా సుజనా స్పందించారు. పొత్తులపై అధిష్టానం నిర్ణయం ప్రకారం నడుచుకుంటామని సుజనా చౌదరి తెలిపారు. అలాగే త్వరలో ఆంధ్రప్రదేశ్ కు మంచి రోజులు వస్తాయని తన నమ్మకం అన్నారు.
అటు చంద్రబాబుకు అనుకూలంగా బీజేపీ ఏపీ బాస్ పురందేశ్వరి పనిచేస్తున్నారంటూ జరుగుతన్న ప్రచారంపై సుజనా స్పందించారు. ఇలాంటి ప్రచారాలు చేసే వారిపై ఆయన మండిపడ్డాహరు. పురందేశ్వరి చంద్రబాబు కోసం పనిచేస్తుందనే వారు ఆధారాలు బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తద్వారా తన పార్టీ బాస్ కు అండగా నిలిచారు. వచ్చే ఎన్నికల్లో విజయవాడ ఎంపీగా సుజనా పోటీ చేసే అవకాశం ఉందని జరుగుతున్న ప్రచారంపై మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు.












Click it and Unblock the Notifications