ఆ సెటిల్మెంట్ కోసమే బాబు సింగపూర్ టూర్..! అంబటి షాకింగ్..!
ఏపీలో సీఎం చంద్రబాబు సింగపూర్ టూర్ తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఓవైపు ప్రభుత్వం ఈ టూర్ పెట్టుబడుల ఆకర్షణ కోసమేనని చెబుతుండగా.. మరోవైపు విపక్ష వైసీపీ మాత్రం దీని వెనుక కీలక కారణాలు ఉన్నాయని చెబుతోంది. ఇదే క్రమంలో వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇవాళ చంద్రబాబు సింగపూర్ టూర్ వెనుక ఉన్న మరో కారణం చెప్పారు. ఇప్పటికే ఆయన 58 సార్లు సింగపూర్ పర్యటనలకు వెళ్లారని గుర్తుచేశారు.
పాత లావాదేవీలను సెటిల్ చేసుకునేందుకే సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ సింగపూర్‌కు వెళ్ళారని అంబటి రాంబాబు తెలిపారు. ఇప్పటి వరకు 58 సార్లు సింగపూర్ వెళ్ళిన చంద్రబాబు ఒక్క రూపాయి అయినా పెట్టుబడి తీసుకువచ్చారా అని ప్రశ్నించారు. అవినీతి కేసులో సింగపూర్‌లో జైలుకు వెళ్ళి, ఇటీవల బయటకు వచ్చిన ఈశ్వరన్‌ను కలిసేందుకే సింగపూర్‌కు వెళ్ళారా అని చంద్రబాబును ప్రశ్నించారు.

చంద్రబాబు సింగపూర్ పర్యటనలో ఏం సాధించారంటే శూన్యమన్నారు. పాత లావాదేవీలు సెటిల్ చేసుకోవడానికి వెళ్ళారా లేక గతంలో సింగపూర్ మంత్రిగా ఉండి జైలుపాలైన ఈశ్వరన్ ఇటీవలే విడుదలైన నేపథ్యంలో ఆయనను కలిసేందుకు వెళ్ళారా.? ఎందుకు సింగపూర్ వెళ్ళారో చెప్పాలన్నారు. వైయస్ఆర్‌సీపీ సింగపూర్ కంపెనీలను రాష్ట్రం నుంచి గెంటేసిందని లోకేష్ పిట్టకథలు చెబుతున్నారని, కానీ చంద్రబాబు అవినీతిని చూసి సింగపూర్ ప్రభుత్వమే రాబోమని చెప్పేసిందన్నారు.

మరోవైపు సింగపూర్ ప్రభుత్వానికి వైసీపీ నేత పెద్దిరెడ్డి కంపెనీలో పనిచేసే వ్యక్తి మెయిల్స్ పంపారంటూ మంత్రి లోకేష్ చేసిన ఆరోపణలపై అంబటి తీవ్రంగా స్పందించారు. వాస్తవం ఏమిటీ అంటే చిలకలూరి పేటకు చెందిన మురళీకృష్ణ చౌదరి అనే ఆయన యూఎస్ లో ఉంటారని, ఆయన టీడీపీ వీరాభిమాని అని అంబటి తెలిపారు.చిలుకలూరిపేటలో ఆయన ఆస్తులను కాజేసేందుకు టీడీపీ ఎమ్మెల్యే ప్రయత్నించడంతో ఆయన ఇటీవలే ఆ పార్టీపై ఆగ్రహంతో మద్యం సేవించి సింగపూర్ కు ఈమెయిల్స్ పెట్టారన్నారు. దాన్ని మంత్రి లోకేష్ వక్రీకరిస్తూ మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై ఆరోపణలు చేస్తున్నారన్నారు.












Click it and Unblock the Notifications