మళ్లీ గెలవండి చూద్దాం- నెల్లూరు సస్పెండ్ ఎమ్మెల్యేలకు అనిల్ సవాల్-గెలిచి చూపిస్తానన్న మేకపాటి..
నెల్లూరు : తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేసి వైసీపీ నుంచి సస్పెండైన నలుగురు ఎమ్మెల్యేలపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఇదే క్రమంలో నెల్లూరు జిల్లాలో ఇలా సస్పెండైన ముగ్గురు ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఇవాళ సవాల్ విసిరారు. దీనిపై స్పందించిన ఓ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి ఆయనకు ఘాటు సమాధానం ఇచ్చారు.
వచ్చే ఎన్నికల్లో వైసీపీ బహిష్కృత ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, ఆనం, మేకపాటికి ఓటమి తప్పదని మాజీ మంత్రి అనిల్ యాదవ్ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ఈ ముగ్గురు గెలిచి అసెంబ్లీకి వస్తే.. తన రాజకీయాన్ని మూసేస్తానన్నారు. తాను గెలిచి అసెంబ్లీకి వస్తే.. మీరు రాజకీయాల నుంచి వెళ్లిపోతారా అని వారిని ప్రశ్నించారు. 2024 ఎన్నికల్లో ఎవరు అసెంబ్లీకి వస్తారో తేల్చుకుందామన్నారు. ఈసారి అనిల్ ను శాసనసభకు రానీయమంటూ కొందరు మంగమ్మ శపథాలు చేస్తున్నారని, ఇటీవల పసుపు కండువా కప్పుకున్న కొందరు జిల్లాలో పదికి పది స్థానాలు సాధిస్తామని చెబుతున్నారని అనిల్ విమర్శించారు.

పది స్థానాలు కాదు.. వెళ్లిన ముగ్గురు ముందు గెలవండని అనిల్ వారికి సూచించారు. వచ్చే ఎన్నికల్లో జగన్ బొమ్మతోనే నేను ఎన్నికల్లో పోటీ చేస్తా.. గెలుస్తా.. నన్ను ఆపండి.. చూద్దాం అని సవాల్ విసిరారు. ముగ్గురు ఎమ్మెల్యేలు వెళ్ల డం వల్ల జిల్లాలో వైసీపీకి ఊడిందేమీ లేదన్నారు. కార్యకర్తలు,ప్రజలు జగన్ వెంటే ఉన్నారన్నారు. వచ్చే ఎన్నికల్లోను జగన్ కు ఓట్లు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. దీనిపై వీరిలో ఒకరైన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్పందించారు.
వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి చూపిస్తానని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అనిల్ యాదవ్ కు తెలిపారు. గెలవకపోతే రాజకీయాలు పూర్తిగా వదిలేస్తానన్నారు. నువ్వు గెలవకుంటే రాజకీయాల నుండి తప్పుకుంటావా? అని అడిగారు. నోరు ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు. సింగిల్ డిజిట్ తో గెలిచిన నువ్వు ఎక్కడా.. 35 వేలమెజార్టీతో గెలిచిన నేనెక్కడా అని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో తాను, ఆనం, కోటంరెడ్డి గెలవడం ఖాయమన్నారు.












Click it and Unblock the Notifications