సాయిరెడ్డి రీఎంట్రీ ? ఎక్కడో ప్రేమ.. వైసీపీ మాజీ మంత్రి షాకింగ్..!
ఏపీలో వైసీపీకీ, ఎంపీ పదవికీ, పూర్తిగా రాజకీయాలకే గుడ్ బై చెప్పేసి వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించిన విజయసాయిరెడ్డి తిరిగి ఆ పార్టీపైనే పోరు మొదలుపెట్టడం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. జగన్ ను ఏమీ అనకుండానే ఆయన చుట్టూ కోటరీ వల్లే తాను పార్టీని వీడి బయటికి వచ్చానని చెప్పడంపై పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఇన్నాళ్లూ జగన్ కోటరీలో ఉన్న మీరే అలా అంటే ఎలా అంటూ సాయిరెడ్డిపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు.
వైయస్ జగన్ కోటరీ అంటే అది ఆయనను అభిమానించే ప్రజలు, 15 ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న వైయస్సార్సీపీ కార్యకర్తలేనని మాజీ మంత్రి, విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ తెలిపారు. విజయవాడలో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. నిన్నటి వరకు వైయస్ జగన్ కోటరీలోనే ఉన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు కోటరీ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. వైయస్ జగన్‌కు అత్యంత సన్నిహితుడుగా ఆయన మాటల్లోనే చెప్పాలంటే పూజారిగా ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి ఎలా వ్యవహరించారో ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు.

సాయిరెడ్డి కోటరీ కామెంట్స్ పై స్పందిస్తూ.. కోటరీ అనేది అన్ని రంగాల్లో, అన్ని వ్యవస్థల్లో సాధారణంగా కనిపించేదే అన్నారు. టీడీపీలో చంద్రబాబు చుట్టూ కోటరీ లేదా? ఆ కోటరీల గురించి బయట ఉన్నవారెవరైనా మాట్లాడితే బాగుంటుందన్నారు. అంతే కానీ కోటరీలో ఉండి వచ్చిన వ్యక్తులే కోటరీ గురించి మాట్లాడటం భావ్యం కాదన్నారు. విజయసాయిరెడ్డి వైసీపీని వీడి వెళ్లిపోయిన తర్వాత ఇంతకన్నా పద్దతిగా మాట్లాడతారని అనుకోలేదన్నారు. ఢిల్లీ వేదికగా రాజకీయాలకు దూరంగా ఉంటానని, వ్యవసాయం చేసుకుంటానని ప్రకటించిన సాయిరెడ్డి..నిన్నటి రోజు వరకు ఏ పార్టీలో చేరబోయేది నిర్ణయం తీసుకోలేదని చెప్పారని గుర్తుచేశారు.
ఆయన మాటల్లో మార్పు చాలా స్పష్టంగా, భిన్నంగా కనిపిస్తోందని గుడివాడ అమర్ నాథ్ తెలిపారు. విజయసాయిరెడ్డికి ఒకరి మీద మనసు విరిగిపోయిందంటే ఇంకొకరి ప్రేమ పుట్టిందనే అనుకోవాలన్నారు. వైయస్సార్సీపీ గత ఎన్నికల్లో ఓటమి తర్వాత 10 నెలల కాలంలో చాలా పరిణామాలు చూసిందని, పలువురు పార్టీని వీడి వెళ్లిపోయారని గుర్తుచేశారు. కొందరు పార్టీ పట్ల వ్యతిరేక వ్యాఖ్యలు చేశారన్నారు. మొన్నటి ఎన్నికల్లో వైయస్సార్సీపీ గెలిచి వైయస్ జగన్ రెండోసారి సీఎం అయ్యుంటే వీళ్లంతా ఇలా మాట్లాడే వారేనా? పార్టీని వీడి వెళ్లిపోయే వారేనా?అని గుడివాడ ప్రశ్నించారు.

ఇది ఏ ఒక్కరి గురించో కాదు. అందరికీ వర్తిస్తుందన్నారు. . తాజాగా విజయసాయిరెడ్డి మాటలను బట్టి ఆయన వ్యవసాయం చేయబోవడం లేదని, రాజకీయమే చేస్తారని స్పష్టంగా అర్ధమైపోయిందన్నారు. రాజకీయాల్లో నిత్యం అధికారంలో ఉండటం సాధ్యం కాదని, తప్పులను సరిదిద్దుకోవాలే కానీ, నిందలు మోపడం సరికాదన్నారు.. కాకినాడ సీ పోర్ట్ వ్యవహారంలో తప్పు జరిగిందా లేదా అనేది దర్యాప్తు సంస్థలు నిర్ధారిస్తాయని మనం పేర్లు చెప్పినంత మాత్రాన వారంతా నిందితులు అయిపోతారా అని అడిగారు. వ్యక్తిగత విమర్శలు చేసి వైయస్ జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేయాలనే కుట్రలు ఆయన పార్టీ పెట్టిన నాటి నుంచి జరుగుతూనే ఉన్నాయన్నారు. బురదజల్లేసి పోవడం కొందరు పనిగా పెట్టుకుంటారని సాయిరెడ్డిపై ఫైర్ అయ్యారు.












Click it and Unblock the Notifications