1995 నాటి చంద్రబాబు మాకొద్దు..!
ఈ మధ్య ఎక్కడ చూసినా సీఎం చంద్రబాబు ఓ స్లోగన్ వినిపిస్తున్నారు. అదే 1995 నాటి చంద్రబాబును చూస్తారు. గతంలో సీఎంగా ఉన్నప్పుడు అధికారులను గడగడలాడించిన చంద్రబాబు.. ఇప్పుడు అదే అధికారులు తన మాట వినకుండా లైట్ తీసుకుంటున్న సందర్భంలో వారికి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. గతంలో 1995లో తాను ఎలా ఉండే వాడినో చూస్తారని అంటున్నారు. దీనిపై వైసీపీ మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఇవాళ స్పందించారు.
1995 నాటి చంద్రబాబును మళ్లీ చూస్తారంటూ సీఎం చెప్తున్నారని, కానీ మరోవైపు ఆయనే తాను మారిన మనిషని చెప్పుకుంటున్నారన కాకాణి గోవర్ధన్ రెడ్డి గుర్తుచేశారు. 1995 నాటి చంద్రబాబును వద్దనుకునే ప్రజలు అప్పట్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి ఓటేసారని గుర్తుచేశారు. 1995లో చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమే బాగోలేదని, అప్పట్లో మామ ఎన్టీఆర్ ఇచ్చిన రెండు హామీల్ని ఆయన నుంచి అధికారం లాక్కున్న చంద్రబాబు తుంగలో తొక్కారని గుర్తుచేశారు.

వ్యవసాయం దండగ అని అప్పట్లో మనసులో మాట పుస్తకంలో చంద్రబాబే రాసుకున్నారని, ఉచిత విద్యుత్ ఇస్తే తీగలపై బట్టలూ ఆరేసుకోవాల్సి వస్తుందని అప్పట్లో చంద్రబాబు చెప్పిన మాటల్ని మరోసారి కాకాణి గుర్తుచేశారు. ఇప్పుడు కూడా సూపర్ సిక్స్ హామీలు ఇచ్చి వాటిని అమలు చేయడం లేదని, కాబట్టి ఇప్పుడు మారిన మనిషిలా 1995 నాటి చంద్రబాబులా కాకుండా పనిచేయాలని చంద్రబాబుకు కాకాణి సూచించారు. మరోవైపు నెల్లూరు బ్యారేజ్ కు నల్లపురెడ్డి శ్రీనివాసులరెడ్డి, సంగం బ్యారేజీకి మేకపాటి గౌతం రెడ్డి పేర్లు మార్చడం సరికాదని కాకాణి తెలిపారు.












Click it and Unblock the Notifications