Seediri Appalaraju: వైసీపీ మాజీ మంత్రి అరెస్ట్-కుమారుడి యాక్సిడెంట్ కేసులో..!
వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు (seediri appalaraju)ను పోలీసులు ఇవాళ అరెస్టు చేశారు. తన కుమారుడు చేసిన ఓ రోడ్డు యాక్సిడెంట్ ను కప్పిపుచ్చేందుకు మరో వ్యక్తిని ఈ కేసులో ఇరికించిన వ్యవహారంలో సీదిరి అప్పలరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన అప్పలరాజుకు ఊరట దక్కలేదు. దీంతో ఇవాళ పోలీసులు ఆయన్ను కాశీబుగ్గలోని ఇంట్లోనే అరెస్టు చేశారు.
తాజాగా శ్రీకాకుళం జిల్లాలో దానయ్య అనే గొర్రెల కాపరిని మాజీ మంత్రి అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ బైక్ యాక్సిడెంట్ చేశారు. ఈ ఘటనలో గొర్రెలకాపరి దానయ్య చనిపోయాడు. అయితే తన కొడుకు ఆరవ్ ను కాపాడేందుకు సిద్దార్ధ అనే మరో వ్యక్తిని నిందితుడిగా చూపేందుకు అప్పలరాజు కుట్ర చేశారనేది పోలీసుల ఆరోపణ. ఈ ప్రమాదం జరిగిన అనంతరం ఆధారాల సేకరణలో పోలీసులకు ఈ వివరాలు లభించాయి. దీంతో ఇవాళ అప్పలరాజును అరెస్టు చేసినట్లు తెలుస్తోంది.

గొర్రెలకాపరి మృతి కేసుతో సంబంధం లేని సిద్ధార్ధ అనే యువకుడిని తన కుమారుడి స్ధానంలో ఉంచి జైలుకు పంపేందుకు అప్పలరాజు ప్రయత్నించారని, అలాగే అతని కుటుంబాన్ని ప్రలోభ పెట్టారని అప్పలరాజుపై పోలీసులు అభియోగాలు మోపారు. అలాగే ఈ ప్రమాదానికి కారణమైన బైక్ ను తప్పించి నేరం కప్పిపుచ్చేందుకు కూడా ప్రయత్నించినట్లు అభియోగాలు ఉన్నాయి. దీంతో అప్పలరాజుపై కేసు నమోదు చేసి ఇవాళ అదుపులోకి తీసుకున్నారు. ఆయన అరెస్టు చూపించి కోర్టులో హాజరుపర్చే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications