వైసీపీ చాప కింద నీరు: ప్రక్షాళన షురూ
YS Jagan Mohan Reddy: మొన్నటి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం అనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. చాప కింద నీరులా పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన నాయకుల గురించి ఆరా తీస్తోంది అగ్ర నాయకత్వం. వారిపై వేటు వేస్తోంది.
సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అనూహ్య పరాజయాన్ని ఎదుర్కొన్న విషయం తెలిసిందే. వై నాట్ 175 అనే నినాదంతో ఎన్నికలకు వెళ్లి బోల్తా పడింది. పట్టుమని 10 సీట్లను దక్కించుకోవడానికి తలకిందులుగా తపస్సు చేయాల్సి వచ్చింది. 2019 నాటి ఎన్నికల్లో 151 సీట్లతో జయకేతానాన్ని ఎగురవేసిన చోట.. 11 సీట్లకు పరిమితం కావాల్సి వచ్చింది.

దీనికి గల కారణాలపై ఇప్పటికే విశ్లేషణలను మొదలుపెట్టింది వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వం. కొద్దిరోజుల కిందటే అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో వరుసగా సమీక్షలను సైతం చేపట్టారు. అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలవారీగా పార్టీ నాయకులు, ఇన్‌ఛార్జీలు, జిల్లా అధ్యక్షులతో సమావేశం అయ్యారు.
ఈ క్రమంలో కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నారు వైఎస్ జగన్. పార్టీలో ఉంటూ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై కొరడా ఝుళిపించారు. వారిపై సస్పెండ్ వేటు వేస్తోన్నారు. నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలను కూడా మార్చుతున్నారు. సమర్థులకు బాధ్యతలను అప్పగిస్తోన్నారు.

తాజాగా శ్రీసత్యసాయి పుట్టపర్తి జిల్లాకు చెందిన కదిరి అసెంబ్లీకి సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే పీవీ సిద్ధారెడ్డిని సస్పెండ్ చేశారు. ఈ ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కలేదు. మైనారిటీల ఓటుబ్యాంకు బలంగా ఉన్న నియోజకవర్గం కావడం వల్ల బీఎస్ మక్బూల్ అహ్మద్‌ను బరిలో దించారు. ఇది సానుకూల ఫలితాన్ని ఇవ్వలేదు.
తన సమీప ప్రత్యర్థి, తెలుగుదేశానికి చెందిన కందికుంట వెంటకప్రసాద్ చేతిలో 6,000లకు పైగా ఓట్ల తేడాతో ఓడిపోయారు మక్బూల్. తనకు టికెట్ దక్కకపోవడం వల్ల పీవీ సిద్ధారెడ్డి పార్టీకి వ్యతిరేకంగా పని చేశారని, అభ్యర్థి ఓటమి కోసం ప్రత్యర్థితో చేతులు కలిపారంటూ వైఎస్ఆర్సీపీ అగ్రనాయకత్వానికి ఫీడ్ బ్యాక్ అందింది. దీనితో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు.












Click it and Unblock the Notifications